
లక్నో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,14,031 మందిని పొట్టనబెట్టుకుంది. బిహార్‌లోనూ పంజా విసురుతోంది. తాజాగా రాష్ట్రానికి చెందిన పోలీస్ ఇన్స్‌పెక్టర్ జనరల్ కరోనాతో కన్నుమూశారు. పుర్నియాలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ బినోద్ కుమార్ మూడు రోజులుగా కరోనాతో పోరాడి ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా.. జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బిహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69), బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కూడా కోవిడ్ బారినపడి ఇటీవల మరణించారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,619 చేరగా.. వైరస్ బారినపడి 990 మంది మరణించారు.