ఒక్కసారి డిసైడ్‌ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత

Bihar prodigy son of a farmer cracked IIT JEE at 13 employed by Apple at 24 - Sakshi

చిన్నవయసులోనే ఐఐటీ ర్యాంక్, యాపిల్ కొలువు

మన దగ్గర స్పూర్తిదాయక కథనాలకు కొదవే లేదు. ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంత యువత మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తున్నారు.  ఏ ప్రాంతం,  ఎంత డబ్బు ఉంది ఇలాంటి వాటితో సంబంధం లేకుండా మొక్కవోని పట్టుదలతో ఎదిగి  తామేంటో నిరూపించుకుంటున్నారు.  కలల సాకారం కోసం ఒక్కసారి  గట్టి నిశ్చయించు కుంటే.. తమకు ఎదురే ఉండదని నిరూపిస్తున్నారు.   బిహార్‌కు  చెందిన ఒక రైతు బిడ్డ  సక్సెస్‌ స్టోరీ  ఆదర్శవంతంగా నిలుస్తోంది.

బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని  పేద రైతు సిద్ధనాథ్ సింగ్ కుమారుడు సత్యం కుమార్‌ 13ఏళ్లకే  కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-JEE)లో  సీటు సాధించి విశేషంగా నిలిచాడు.  రైతు బిడ్డ సత్యం  2013లో  679 ర్యాంక్‌  సాధించాడు.  2010లో IIT సీటు పొందిన ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల సహల్ కౌశిక్  రికార్డును  ఛేదించి అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డును బద్దలు కొట్టాడు.

ఐఐటీ పరీక్షకు సంబంధించి కుమార్‌కి ఇది రెండో ప్రయత్నం. 2012లో  12 ఏళ్ళ  వయసులోనే ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించాడు. అయితే   బెస్ట్‌ ర్యాంక్‌  కోసం  12 నెలల తర్వాత మళ్లీ పరీక్ష రాసి విజయం సాధించాడు. రెండో  ప్రయత్నంలో  రికార్డు ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మూడు ప్రాజెక్టులపై పనిచేశాడు. ఎలక్ట్రోక్యులోగ్రామ్  బేస్డ్‌ ఐ బ్లింక్  క్లాసిఫికేషన్‌  డ్యూరింగ్‌  EOG సిగ్నల్ అక్యుయిషన్ టైం,   “వివిధ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లలో ఎలక్ట్రోడ్ స్థానాల ఆప్టిమైజేషన్” ,  “ఇమాజినేటివ్ స్పీచ్ బేస్డ్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్”  ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. ఇక్కడితో సత్యం కుమార్‌  విజయ్‌ ప్రస్థానం ముగిసిపోలేదు.  తాజాగా 24 ఏళ్ల వయసులో టెక్‌ దిగ్గజం యాపిల్‌ అతణ్ని ఉద్యోగంలోకి తీసుకుంది. 

2018లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి B.Tech-M.Tech ఉమ్మడి కోర్స్‌  పట్టా సాధించాడు సత్యం కుమార్. ప్రస్తుతం ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేస్తున్నాడు. 2023 ఆగస్టు వరకు యాపిల్‌లో  మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పని చేశాడు.  బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ నిపుణుడిగా ఉన్న కుమార్‌ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో  గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పలు టెక్నాలజీలను పిల్లలకు బోధించడానికి,వారి జీవితాలను మెరుగుపరచడానికి బిహార్‌లోని తన సొంత జిల్లా భోజ్‌పూర్‌కు తిరిగి రావాలని భావిస్తున్నట్టు ఇటీవల మీడియాతో చెప్పాడు

 ఎనిమిదో తరగత వరకు స్కూలు అంటే  ఏంటో తెలియదు
జూలై 20, 1999న జన్మించాడు సత్యం కుమార్‌. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంతటి వాడు కావాలనేది డ్రీమ్‌.  ఇంకో విశేషం ఏమిటంటే అసలు ఎనిమిదో తరగతి వరకు స్కూల్‌కే వెళ్లలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో,  స్థానిక వీర్ కుర్ సింగ్ కాలేజీలో క్లర్క్, మేనమామ పశుపతి సింగ్ సహాయంతో ఇంట్లోనే  ప్రాథమిక విద్య పూర్తైంది.  2007లో రాజస్థాన్ బోర్డ్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి  కోటలోని మోడ్రన్ స్కూల్‌లో అడ్మిషన్ పొందాడు. అలా ఎనిమిదో తరగతిలో తొలిసారి పాఠశాలకు వెళ్లాడు. చాలా తొందరగా నేర్చుకునే తత్వం అసాధారణమైన జ్ఞాపకశక్తిగల విద్యార్థిగా ప్రశంసలందుకున్నాడు.  రాజస్థాన్ బోర్డ్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని  పదేళ్లకే పదో తరగతి,  12 సంవత్సరాల వయస్సులో XII తరగతిని క్లియర్ చేయడం  విశేషం.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ డ్రీమ్‌
అంతేకాదు తానేమీ పుస్తకాల పురుగును కాదనీ,  సినిమాలు చూస్తా.. ఫుట్‌ బాల్‌ ఆడుకుంటా..  మొబైల్‌ చూస్తా..కానీ పూర్తి శ్రద్ధగా ఆరుం గంటలు చదువుకుంటా అని గతంలో తన స్టడీ హ్యాబిట్స్ గురించి  తెలిపాడు. నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి ఘనతను సాధించాలనేది కల.  టెక్నాలజీ ప్రపంచంలో దూసుకుపోవాలి...ఫేస్‌బుక్‌కు సమానమైనదాన్ని అభివృద్ధి చేయాలనేది  అతని ఆకాంక్ష.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top