Kartik Kumar Resignation: కిడ్నాప్‌ కేసులో ఆరోపణలు.. శాఖ మార్చిన కాసేపటికే బిహార్‌ మంత్రి రాజీనామా

Bihar Minister Accused In Kidnapping Case Resigns Amid Protests - Sakshi

పాట్నా: కిడ్నాప్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత, బిహార్‌ న్యాయశాఖ మంత్రి కార్తీక్‌ కుమార్‌ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కార్తీక్‌ కుమార్‌ తన రాజీనామాను గవర్నర్‌కు పంపగా.. ఆయన ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాగా 2014లో జరిగిన ఓ కిడ్నాప్‌ కేసులో మంత్రి నిందితుడిగా ఉండటంతో విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేశాయి.

ఈ నిరసనల నేపథ్యంలో కార్తీక్‌ కుమార్‌ను.. బిహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి.. ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు శాఖను అప్పగించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో కొత్త శాఖను కేటాయించిన గంటల వ్యవధిలోనే కార్తీక్‌ కుమార్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్తీక్‌ కుమార్‌ రాజీనామాతో.. రెవెన్యూశాఖ మంత్రి అలోక్‌ కుమార్‌ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అ‍ప్పగించారు.

ఇక బిహార్‌లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు కార్తీక్‌ కుమార్‌. బిహార్‌లో రాజకీయంగా శక్తివంతమైన భూమిహార్‌ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
చదవండి: భారత్‌లో కొత్తగా 7 వేల కరోనా కేసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top