అమెరికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

Biden and Narendra Modi meet on 24th to discuss Afghan consequences - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీకి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా బుధవారం(సెప్టెంబర్‌ 22వ తేదీ)న అమెరికా పర్యటనకు బయల్దేరారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 24న ఇరువురు నేతలు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో అఫ్గానిస్తాన్‌ తాజా పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలపై పోరాటం, భారత్‌–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించబోతున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా మంగళవారం చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత ప్రధానితో భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించనున్నట్లు శ్రింగ్లా వెల్లడించారు.

మోదీ బుధవారం అమెరికాకు పయనమవుతారని, ఈ నెల 26న భారత్‌కు తిరిగి వస్తారని చెప్పారు. బైడెన్‌తో సమావేశం కావడంతోపాటు ఈ నెల 24న వాషింగ్టన్‌లో ‘క్వాడ్‌’ నేతల సదస్సులో పాల్గొంటారని, 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 76వ సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. గురువారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో చర్చలు జరుపుతారని వివరించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వాతావరణ మార్పులు తదితర అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానమంత్రులతోనూ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేపట్టాల్సిన సంస్కరణలు బైడెన్‌–మోదీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందన్నారు. అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు, సీనియర్‌ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంటుందని అన్నారు. ఈ పర్యటనలో పలువురు వ్యాపారవేత్తలతో మోదీ సమావేశమవుతారని శ్రింగ్లా పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top