
దొడ్డబళ్లాపురం: మాజీ ఎంపీ డీకే సురేశ్, తదితర ప్రముఖ రాజకీయ నాయకులు బాగా తెలుసని చెబుతూ ఐశ్వర్యగౌడ అనే కిలాడీ కోట్లాది రూపాయల బంగారం, నగదు వసూలు చేయడం తెలిసిందే. ఆ కేసుల్లో ఆమె అరెస్టయి ఈడీ విచారణను ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటిదే మరొకటి బయటపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాగా తెలుసని చెప్పుకొని రూ.30 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసిన కేడీ లేడీని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్టు చేశారు.
బాగా డబ్బు కలిగిన మహిళలను కిట్టీ పార్టీ పేరుతో ఇంటికి పిలిచి విందు వినోదాలు నిర్వహించేది. వారు పూర్తిగా నమ్మారని తెలిశాక అదను చూసుకుని ఏదో కారణం చెప్పి లేదా తక్కువ ధరకు బంగారం ఇస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునేది. తనకు సీఎం, డీసీఎం, స్పీకర్ ఇంకా చాలామంది రాజకీయ నాయకులు తెలుసని చెప్పుకునేది.
స్పీకర్ ఖాదర్‌తో సహా పలువురు వీఐపీలతో తీసుకున్న ఫోటోలు చూపించేది. ఇలా 20 మంది నుండి రూ.30 కోట్ల వరకూ వసూలు చేసింది. చాలా రోజుల తరువాత మోసపోయామని తెలుసుకున్న బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సవితను అరెస్టు చేశారు. గోవిందరాజనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఈమెపై కేసు నమోదైంది.