డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ మోసం
బెంగళూరు మహిళకు టోకరా
బెంగళూరు: సైబర్ నేరగాళ్ల చేతిలో బెంగళూరుకు చెందిన సీనియర్ ఐటీ ఉద్యోగి మోసపోయారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను బెదిరించిన నేరగాళ్లు ఏకంగా.. రూ.32 కోట్లు కొట్టేశారు. గతేడాది చివరి మూడు నెలల్లో మొదలైన ఈ ఘరానా మో సం ఈ ఏడాది వరకు కొనసాగింది. కొడుకు పెళ్లి ఉండటంతో విషయం బయటకు తెలియకుండా ఉంచిన మహిళ.. ఎట్టకేలకు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని చెప్పి...
బెంగళూరుకు చెందిన 57 మహిళ ఐటీ ఉద్యోగి. 2024 సెప్టెంబర్ 15న ఆమెకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను తాను డీహెచ్ఃల్ కొరియర్ కంపెనీ ప్రతినిధిగా చెప్పుకొన్నాడు. మహిళ పేరుతో 3 క్రెడిట్ కార్డులు, 4 పాస్‌పోర్టులు, నిషేధిత ఎండీఎం డ్రగ్స్ ఉన్న పార్సిల్ ముంబైలోని తమ కొరియర్ సెంటర్‌కు వచ్చిందని చెప్పాడు. అయితే తానుండేది బెంగళూరులోనని, ఆ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని మహిళ చెప్పారు.
ఆ ప్యాకేజీ ఆమె నెంబర్‌తోనే లింక్ చేసి ఉందని, అది సైబర్ మోసం కావచ్చని కూడా చెప్పాడు. అంతేకాదు సైబర్ క్రైమ్‌సెల్‌కు ఫిర్యాదు చేయాలంటూ ఆమెకు సూచించాడు. సీబీఐ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తికి కాల్ ట్రాన్స్‌ఫర్ చేశారు. సదరు వ్యక్తి మహిళ నుంచి అనేక వివరాలు సేకరించాడు. సాక్షాలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆమెపై తమ నిఘా ఉందని భయపెట్టాడు. ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు చెప్పొద్దని, ఎవరికైనా చెప్పాలని చూస్తే కుటుంబం మొత్తం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.
దీంతో భయపడ్డ ఆమె.. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లే చేసింది. కొన్ని రోజులకు మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసి ఆమెను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు బెదిరించారు. ఆ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మహిళ ఆ విషయాన్ని వాళ్లకు చెప్పారు. దీంతో 2024 సెప్టెంబర్ 23న ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. మహిళ ఆస్తులన్నింటినీ ఆర్‌బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ముందు ప్రకటించాలని చెప్పాడు. బాధిత మహిళ ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పినట్లే చేసింది. నెమ్మదిగా వారిని నమ్మేసింది. దీంతో ఆమె నుంచి డబ్బు లాగడం మొదలుపెట్టారు.
187 లావాదేవీల్లో రూ. 31.83 కోట్లు బదిలీ..
ఆమెను రెండు స్కై‹ప్ ఐడీలను ఇన్‌స్టాల్ చేయాలని చెప్పి, నిరంతరం వీడియో కాల్‌లో ఉండాలని బెదిరించారు. వీడియో కాల్ మొదలైన తరువాత మోహిత్ హండా అనే వ్యక్తి ఆమెను రెండు రోజులు పర్యవేక్షించాడు. ఆ తర్వాత రాహుల్ యాదవ్ అనే వ్యక్తి ఒక వారం పాటు ఆమెపై నిఘా ఉంచాడు. ప్రదీప్‌సింగ్ అనే వ్యక్తి సీనియర్ సీబీఐ అధికారిగా నటిస్తూ ఆమె నిర్దోషి అని నిరూపించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అలా గతేడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 22 మధ్య మహిళ తన ఆర్థిక వివరాలను వెల్లడించి, పెద్ద మొత్తంలో డబ్బును వారికి బదిలీ చేసింది.
అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు రూ. 2 కోట్లు డిపాజిట్ చేసింది, ఆ తరువాత పన్నుల పేరుతో మరికొంత చెల్లించింది. చివరకు తన ఫిక్స్‌డ్ డిపాజిట్లను, ఇతర పొదుపులను కూడా డ్రా చేసి 187 లావాదేవీల్లో రూ.31.83 కోట్లను వారికి బదిలీ చేసింది. ఆమె నిర్దోషి అని తేలితే ఈ ఏడాది ఫిబ్రవరిలో డబ్బు తిరిగి స్తామని వారు చెప్పారు. నిరంతరం నిఘా, ఒత్తిడి మధ్య ఆమె జబ్బు పడింది. దీంతో ఒక నెల చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ ఆమె ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నదనే విషయాలను ఎప్పటికప్పుడు వారికి చెబుతూ వచ్చింది.
ఫిబ్రవరిలో డబ్బు తిరిగి ఇచ్చేస్తామన్న వారు.. మార్చికి వాయిదా వేశారు. కొన్ని రోజుల తరువాత వారి నుంచి కాల్స్ ఆగిపోయాయి. కమ్యూనికేషన్ లేకుండా పోయింది. జూన్‌లో తన కొడుకు పెళ్లి ఉండటంతో అప్పటివరకు ఆగిన మహిళ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెలæ 14న బెంగళూరులోని తూర్పు డివిజన్ క్రెమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు పెల్లి, ఇతర కారణాల వల్ల ఫిర్యాదు ఆలస్యమైందని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


