
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆమెకు 36, అతడికి 25 ఏళ్లు కాగా.. ఓయో హోటల్ రూమ్‌లో తన ప్రేయసిని ప్రియుడు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. బెంగళూరులోని కెంగేరికి చెందిన హరిణి(36), దాసేగౌడకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ కెంగేరిలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం కెంగేరిలో జాతర జరిగింది. ఈ జాతరకు హరిణి వెళ్లింది. అక్కడే ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యశస్ కూడా ఇదే జాతరకు వెళ్లడంతో.. అక్కడ హరిణిని చూశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో.. వారిద్దరికి పరిచయం ఏర్పడింది. జాతరలోనే ఇద్దరూ ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. తరువాత వారి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో మరింత సన్నిహితంగా మెలిగారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం హరిణి భర్త దాసేగౌడకు కూడా తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. అనంతరం, దాసేగౌడ.. ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకున్నాడు. వారి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. దీంతో, హరిణి తన తప్పును తెలుసుకుని.. భర్త వద్ద కన్నీరుపెట్టుకుని తనను క్షమించాలని కోరింది. ఆమెను నమ్మిన భర్త.. ఫోన్ ఇవ్వడంతో.. మళ్లీ హరిణితో యశస్ కంటాక్ట్‌లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్ చేసి బెంగళూరులోని ఓ హోటల్ గదికి పిలిచాడు. దీంతో, శుక్రవారం వీరద్దరూ పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లోని ఓయో హోటల్‌కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు. గదిలో ఉన్న సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
హరిణి తనతో పాటే ఉండాలని యశస్ పట్టుబట్టాడు. తాను లేకుండా జీవించలేనని.. తనతోనే ఉండాలన్నాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆవేశానికి గురైన యశస్.. హరిణిని దారుణంగా హత్య చేశాడు. హరిణిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత యశస్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి సుబ్రహ్మణ్యపుర పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. విచారణలో భాగంగా యశస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.