బాట్లాహౌస్‌ కేసు: అరిజ్‌ఖాన్‌కు ఉరిశిక్ష 

Batla House Encounter: Death Penalty Awarded to Ariz Khan - Sakshi

బాట్లాహౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు 

దోషికి రూ.11 లక్షల జరిమానా 

బాధిత కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షలివ్వాలని ఆదేశం  

న్యూఢిల్లీ: 2008 నాటి బాట్లాహౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అరిజ్‌ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మను చంపినందుకు అతడికి ఈ శిక్షను ఖరారు చేసింది. అరిజ్‌ చేసిన నేరం గరిష్ట శిక్ష విధించేందుకు వీలు కల్పించే అత్యంత అరుదైన కేటగిరీలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిని మరణించే వరకూ ఉరికి వేలాడదీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి సందీప్‌ యాదవ్‌ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అరిజ్‌ ఖాన్‌కు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించారు. రూ.10 లక్షలను తక్షణమే మోహన్‌చంద్‌ శర్మ కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. 

న్యాయాన్ని కాపాడే అధికారిని చంపేశారు 
బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎ.టి.అన్సారీ వాదనలు వినిపించారు. అరిజ్‌ ఖాన్‌కు ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయని చెప్పారు. న్యాయాన్ని కాపాడే ఒక అధికారిని చంపిన అరిజ్‌ ఖాన్‌కు మరణ శిక్ష విధించాలని కోరారు. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అరిజ్‌ ఖాన్‌తోపాటు మరికొందరు ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే మారణాయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారని గుర్తుచేశారు. అరిజ్‌ ఖాన్‌ తరపున అడ్వొకేట్‌ ఎం.ఎస్‌.ఖాన్‌ వాదనలు వినిపించారు. అరిజ్‌కు ఉరిశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకించారు. అతడు ముందస్తు ప్రణాళిక ప్రకారం కాల్పులు జరపలేదన్నారు. ఎం.ఎస్‌.ఖాన్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ట్రయల్‌ కోర్టు 2013 జూలైలో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది షాజాద్‌ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఏమిటీ కేసు? 
ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులు బాట్లా హౌస్‌లో దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మ అమరులయ్యారు. 
►2008 సెప్టెంబర్‌ 13: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. 39 మంది మృతి, 159 మందికి గాయాలు. 
►2008 సెప్టెంబర్‌ 19: దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.
►2009 జూలై 3: అరిజ్‌ ఖాన్, షాజాద్‌ అహ్మద్‌ను నిందితులుగా ప్రకటించిన న్యాయస్థానం.
► 2010 ఫిబ్రవరి 2: యూపీలోని లక్నోలో షాజాద్‌ అహ్మద్‌ అరెస్టు. 
►2010 అక్టోబర్‌ 1: ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ. 
►2013 జూలై 30: షాజాద్‌ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు. 
►2018 ఫిబ్రవరి 14: అరిజ్‌ ఖాన్‌ అరెస్టు. 
►2021 మార్చి 8: హత్య, ఇతర నేరాల్లో అరిజ్‌ ఖాన్‌ దోషిగా గుర్తింపు. 
►2021 మార్చి 15: అరిజ్‌కు మరణ శిక్ష 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top