చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ

Azadi Ka Amrit Mahotsav Remembering Jawaharlal Nehru Wife Kamala Nehru - Sakshi

1899–1936

కమలా నెహ్రూ భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సతీమణి. ఇంటి పట్టునే ఉండే కమలా నెహ్రూ 1921లో సహాయ నిరాకరణోద్యమంలో మహిళల బందానికి నాయకత్వం వహించి విదేశీ వస్తువులు, దుస్తులు, మద్యం అమ్మకాలు తగవనే నినాదంతో ముందుకు సాగారు. రెండుసార్లు అరెస్ట్‌ అయ్యారు. కమల పాత ఢిల్లీ లోని కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో 1899 ఆగస్టు 1 రాజ్‌పతి, జవహర్‌మల్‌ కౌల్‌ దంపతులకు జన్మించారు. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు. చాంద్‌ బహదూర్‌ కౌల్‌ , కైలాష్‌ నాథ్‌ కౌల్‌; ఒక చెల్లెలు స్వరూప్‌ కఠ్జు.

కమలకు 1916 ఫిబ్రవరి 8న జవహర్‌ లాల్‌ నెహ్రూ తో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్‌ నెహ్రూ. అత్తగారు శ్రీమతి స్వరూప రాణి. ఉద్యమాలు తెలియకుండా పెరిగి వచ్చిన కోడలు సహాయ నిరాకరణకు నడుము బిగించడంతో అత్తమామలు సంతోషించారని అంటారు. ఆమె మామగారు మోతీలాల్‌ నెహ్రూ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తండ్రితో కలసి నెహ్రూ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా ధారపోసింది. చివరకు తమ ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్‌గా మార్చి స్వాతంత్య్ర పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించారు. 1917 నవంబరు 19 తేదీన జవహర్‌ లాల్‌ నెహ్రూ, కమలా నెహ్రూలకు ఏకైక సంతానంగా అలహాబాద్‌ లో ఇందిర జన్మించారు.

1924 లో కమలా నెహ్రూ ఒక బాబును కన్నారు. పూర్తిగా పరిణతి చెందక ముందే జన్మించడం వలన రెండు రోజులలో బాబు చనిపోయాడు. 1934లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు అయి కలకత్తా, డెహ్రాడూన్‌ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం దెబ్బతినింది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ కూడా దిగులుతో అనారోగ్యానికి గురయ్యారు.. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లి 1936లో టి.బి. జబ్బు మూలాన 36 ఏళ్ల వయసుకే మరణించారు.

కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు, పార్కులు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వెలశాయి. కమలా నెహ్రూ తండ్రి జవహర్‌మల్‌ కౌల్‌ప్రసిద్ధ వ్యాపారి. జవహర్‌ లాల్‌ నెహ్రూకు సరైనజోడి కమలా నెహ్రూ అని భావించి, వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత కమలా కౌల్‌ కమలా నెహ్రూగా మారారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top