మొత్తం కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని సర్దార్ పటేల్ సంకల్పించారు
అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అందుకు అనుమతించలేదు
కాంగ్రెస్ తప్పులకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తోంది
చొరబాటుదారులపై ఇక నిర్ణయాత్మక యుద్ధం
ప్రధానమంత్రి మోదీ స్పషీ్టకరణ
గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్
ఏక్తానగర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్ సమస్యకు ఆ పార్టీ తప్పిదాలే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన తప్పులకు కశ్మీర్‌తోపాటు దేశం మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర సంస్థానాల తరహాలోనే మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలని ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ సంకల్పించగా, అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అందుకు అనుమతించలేదని విమర్శించారు.
శుక్రవారం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌లో సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ అంశంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని అన్నారు. ఆ పార్టీ నిర్వాకం వల్ల జమ్మూకశ్మీర్ ముక్కలైపోయిందని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పొరపాట్ల కారణంగా మన దేశం దశాబ్దాలుగా బాధలు అనుభవిస్తోందని ఆక్షేపించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
ఉగ్రవాదానికి తల వంచుతున్న కాంగ్రెస్
‘‘కొత్త చరిత్ర లిఖించడంలో ఒక్క క్షణం కూడా వృథా చేయొద్దని సర్దార్ పటేల్ బోధించారు. కానీ, మనం కొత్త చరిత్ర సృష్టించడానికి కష్టపడి పనిచేయాలి. అసాధ్యం అనుకున్న పనిని పటేల్ సుసాధ్యం చేశారు. 550కుపైగా సంస్థానాలను దేశంలో విలీనం చేశారు. ఆయన పాటించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు కొత్త చరిత్రను సృష్టించాయి. ‘ఒకే ఒక్క ఐక్య భారత్, అద్భుతమైన భారత్’ ఆయన స్వప్నం. దేశ సార్వబౌమత్వ పరిరక్షణకు పటేల్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచి్చన ప్రభుత్వాలు దేశ సార్వబౌమత్వాన్ని నిర్లక్ష్యం చేశాయి.
పటేల్‌తరహాలో శ్రద్ధ చూపించలేదు. ఫలితంగా కశ్మీర్ అంశం పెద్ద సమస్యగా మారింది. ఈశాన్య భారతదేశంలోనూ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. నక్సలైట్–మావోయిస్టు ఉగ్రవాదం దేశమంతటా వ్యాప్తి చెందింది. దేశ సమగ్రత, సార్వబౌమత్వానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పటేల్ విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. వెన్నెముక లేనట్లుగా వ్యవహరించాయి. కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుంది. అక్కడ పాక్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం మొదలైంది. దానివల్ల మన దేశం ఇప్పటికీ నష్టపోతూనే ఉంది.
అక్రమ వలసలతో పెనుముప్పు
నక్సలైట్ల హింసాకాండపై గత 11 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఈ సమస్య పూర్తిగా మటుమాయం అయ్యేదాకా పోరాటం కొనసాగుతుంది. 2014 కంటే ముందు 125 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది. ఇప్పుడు 11 జిల్లాల్లోనే వారి ఉనికి పరిమితమైంది. మరోవైపు అక్రమ వలసలు, చొరబాట్లతో దేశ ఐక్యతకు, అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉంది. చొరబాటుదారులపై నిర్ణయాత్మక యుద్ధం చేయాలని నిర్ణయించాం.
వందేమాతర గీతాన్ని ముక్కలు చేశారు
కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలన నుంచి బానిస మనస్తత్వాన్ని వారసత్వంగా తెచి్చపెట్టింది. వలస పాలన ఆనవాళ్లను ఇప్పుడు వదిలించుకుంటున్నాం. దేశంలో రాజకీయ అస్పృశ్యతను ఒక సంస్కృతిగా మార్చారు. సర్దార్ పటేల్‌కు ఎలాంటి అవమానం జరిగిందో మనకు తెలుసు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా ఆయన పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో చూశాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్‌ను కూడా కాంగ్రెస్ కించపర్చింది. వందేమాతర గీతంలో కొంత భాగాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ మతాన్ని దృష్టిలో పెట్టుకొని తొలగించింది. ఇలా చేయడం సమాజాన్ని విభజించడం, బ్రిటిష్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం కాదా?
భాషా వివాదాలు దురదృష్టకరం
నేడు కొన్ని రాష్ట్రాల్లో భాష పేరిట వివాదాలు తలెత్తడం దురదృష్టకరం. దేశంలో ప్రతి భాషా జాతీయ భాషనే. ఒకరిపై మరో భాషను రుద్దే ప్రయత్నం ఎంతమాత్రం జరగడం లేదు. దేశ ఐక్యతకు భాష ఒక మూలస్తంభం’’ అని ప్రధాని మోదీ అన్నారు.
మోదీ ఐక్యతా ప్రతిజ్ఞ
రాష్ర్టీయ ఏక్తా దివస్ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రజలతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుకొనేందుకు మనమంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలని సూచించారు. ఈసారి ఏక్తా దివస్ వేడుకలు విభిన్నంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నేషనల్ యూనిటీ పరేడ్ నిర్వహించారు. పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది పాల్గొన్నారు. ఆయా దళాలకు మహిళలే నాయకత్వం వహించడం గమనార్హం. యూనిటీ పరేడ్ రిపబ్లిక్ డే పరేడ్ తరహాలో జరగడం విశేషం. అందంగా అలంకరించిన శకటాలను సైతం ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు.


