మనది కాని యుద్ధంలో  మన సైనికులు!

Azadi Ka Amrit Mahotsav Indian Army In First World War HiStory - Sakshi

‘‘స్వర్గం కూలిపోతున్నప్పుడు, భూమి కదలిపోతున్నప్పుడు, వాళ్లు తమది కాని యుద్ధం చేయడానికి వచ్చారు. కూలిపోతున్న ఆకాశాన్ని తమ భుజానికెత్తుకున్నారు. దేవుడు కూడా వదిలేసినవారిని తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు రక్షించారు.’’

మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల గురించి ప్రముఖ ఇంగ్లిష్‌ కవి ఎడ్వర్డ్‌ హౌస్‌మెన్‌ రాసిన మాటలివి. జూలై 28.. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన రోజు. 1914 జూలై నుంచి నాలుగేళ్లపాటు రక్తపుటేరులు పారించిన ఆ సంగ్రామం 1918 నవంబరు 11న  ముగిసింది. ఆ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, కోటీ ముప్పై లక్షల మంది ప్రజలు మరణించినట్లు అంచనా. యుద్ధంలో బ్రిటిష్‌ ఇండియాకు చెందిన 14 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. వారిలో 74 వేల మంది మరణించారు. వాళ్లకు ఫ్రాన్స్, గ్రీస్, ఉత్తర ఆఫ్రికా, పాలస్తీనా, మెసపటోమియాలలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

వాళ్లంతా పాల్గొన్నది బ్రిటన్‌ తరఫున! యూరప్, మధ్యప్రాచ్యం, మధ్యధరా ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో భారత సైనికులు పోరాడారు. భారత సైన్యం వెస్టర్న్‌ ఫ్రంట్‌ను చేరుకోకపోయినా లేక ఇంగ్లిష్‌ చానెల్‌ తీరంలోని పోర్టులను జర్మనీ ఆక్రమించుకున్నా మొదటి ప్రపంచయుద్ధం చరిత్ర మరోలా ఉండేది అంటారు. బెల్జియం, ఈశాన్య ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీలు ఉన్న ప్రాంతానికే వెస్టర్న్‌ ఫ్రంట్‌ అని పేరు. మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన వేదిక ఈ ప్రాంతమే.

లగ్జెంబర్గ్, బెల్జియంలను ఆక్రమించుకున్న జర్మన్‌ సైన్యం వెస్టర్న్‌ ఫ్రంట్‌కు తెరతీసింది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని కీలకమైన పారిశ్రామిక ప్రాంతాలపైనా పట్టు సాధించింది. ఆ సమయంలో జర్మన్‌ సైన్యంపై పోరాడటంలోనూ, నిలువరించటంలోనూ భారత సైన్యం ప్రముఖ పాత్ర పోషించింది. వెస్టర్న్‌ ఫ్రంట్‌ ప్రాంతంలోని బెల్జియం, ఫ్రాన్స్‌ల్లో భారత సైన్యానికి చెందిన 1,30,000 మంది తమ సేవలు అందించారు. వీరిలో 9 వేల మంది మరణించారు.

ఈ ఒక్క వెస్టర్న్‌ ఫ్రంట్‌లోనే కాదు, మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగిన ప్రతి పోరాటంలో బ్రిటిష్‌ ఇండియా సైన్యం పాలుపంచుకుంది. అయితే మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎప్పుడూ భారతీయ నేపథ్యం నుంచి ఎవరూ వివరించలేదు. సైనికులే కాకుండా వాళ్లకు సేవలు అందించేందుకు భారతదేశం నుంచి వేల మంది కూలీలు  వారి వెంట వెళ్లారు. అంతేకాదు,  భారతదేశం తనది కాని యుద్ధం కోసం ధన రూపేణా, ఇతర రూపేణా రూ.13 వేల కోట్లు బ్రిటన్‌కు అందించింది. 

(చదవండి: తొలి షిప్పింగ్‌ మహిళ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top