మహోజ్వల భారతి: చెయ్యనన్నాను కదా... ఎందుకలా చంపుతావ్‌!

Azadi Ka Amrit Mahotsav Cinema Legendry Artists Sv Ranga Rao - Sakshi

ఏదీ లేనప్పుడు ఏదో ఒకదానితో అడ్జెస్ట్‌ అయిపోవడం జీవితంలో ఒక థియరీ. యస్వీఆర్‌ ఆ థియరీలో పడి కొట్టుకుపోలేదు. రంగస్థలంపై తను చేయాలనుకున్న పాత్రనే చేశారు. ఇష్టం లేని పాత్రను ‘చెయ్యను’అని చెప్పడం నేర్చుకున్నారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయన తన నైజం మార్చుకోలేదు. ఇందుకు నిదర్శనంగా ఒక సందర్భాన్ని చిత్రపరిశ్రమలో ప్రస్తావిస్తుంటారు.

డైరెక్టర్‌ సి.పుల్లయ్యని ఎస్వీఆర్‌ ‘బావ బావ’ అని పిలిచేవారు. 1956లో పుల్లయ్య... సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావులను పెట్టి ‘అర్ధాంగి’ సినిమా తియ్యాలనుకున్నారు. దాన్లో ఒక క్యారెక్టర్‌కి ఎస్వీఆర్‌ను అడిగారు పుల్లయ్య. అది మధ్యలోనే చనిపోయే క్యారెక్టర్‌. ‘‘నేను చెయ్యను. చెయ్యడానికి ఏముంది అందులో’’ అన్నారు ఎస్వీఆర్‌. అందుకు పుల్లయ్య – ‘‘లేదు బావా, లాస్ట్‌ వరకు నువ్వు లేకపోయినా, ప్రతి ఫ్రేములోనూ నువ్వు ఉన్న ఫీలింగే ఉంటుంది.

అలా ఇస్తాను దానికి ట్రీట్‌మెంట్‌. నా మాట విని నువ్వా క్యారెక్టర్‌ చెయ్యి’’ అన్నారు. ఎస్వీఆర్‌ విసుక్కున్నారు. ‘బావ’ కాస్తా, ‘ఏవోయ్‌’ అయింది. ‘‘ ఏవోయ్‌... నేను చెయ్యనన్నాను కదా ఎందుకలా చంపుతావ్‌’’ అన్నారు. పుల్లయ్యకు కూడా కోపం వచ్చింది. ‘‘చూస్తూ ఉండు. ఆ క్యారెక్టర్‌కి కొత్తవాడిని బుక్‌ చేసి, నీకు మొగుణ్ణి తయారుచేయకపోతే నా పేరు పుల్లయ్యే కాదు!’’ అన్నారు. చివరికి ఆ పాత్ర గుమ్మడికి వచ్చింది. ఎస్వీ రంగారావు గారి వ్యక్తిత్వంలోని దృఢచిత్తాన్ని ఎరుక పరిచే ఒక సంఘటన మాత్రమే ఇది. నేడు ఆయన జయంతి. 1918 జూలై 3న కృష్ణా జల్లా నూజివీడులో జన్మించారు ఎస్వీఆర్‌. 

నిర్మలా కిషన్‌చంద్‌  
ఈమె ఎవరో కారు. ప్రసిద్ధ బాలీవుడ్‌ నృత్య దర్శకురాలు సరోజ్‌ ఖాన్‌. నేడు ఆమె వర్ధంతి. ఇటీవలే 2020 జూలై 3న తన 71 ఏళ్ల వయసులో ముంబైలో మరణించారు. సరోజ్‌ రెండు వేలకు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. ఆమె తల్లిదండ్రులు కిషన్‌ చంద్‌ సాధు సింగ్, నోని సాధు సింగ్‌. సరోజ్‌ పుట్టిన కొద్ది రోజులకే దేశ విభజన జరగడంతో వీరి కుటుంబం ఇటువైపున భారత్‌లో స్థిరపడిపోయింది. 

హంస జీవరాజ్‌ మెహతా
హంస జీవరాజ్‌ మెహతా ప్రసిద్ధ సంస్కరణవాది, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధురాలు, స్త్రీవాది, రచయిత. నేడు ఆమె జయంతి. హంసా మెహతా 1897 జూలై 3 న ఒక నాగర్‌ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె బరోడా రాష్ట్రానికి చెందిన దివాన్‌ మనుభాయ్‌ మెహతా కుమార్తె. 1918లో సరోజినీ నాయుడును, 1922లో మహాత్మా గాంధీని కలుసుకున్నారు. గాంధీ సలహాను అనుసరించి స్వాతంత్య్ర ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1932లో ఆమెను ఆమె భర్తతో పాటు బ్రిటీష్‌ వారు అరెస్టు చేసి జైలుకు పంపారు. 97 ఏళ్ల వయసులో ఆమె 1995 ఏప్రిల్‌ 4న కన్నుమూశారు.  

(చదవండి: మహోజ్వల భారతి: ‘సైమన్‌ గో బ్యాక్‌’ అన్నది ఈయనే!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top