మహోజ్వల భారతి: ‘సైమన్‌ గో బ్యాక్‌’ అన్నది ఈయనే!

Aadi Ka Amrit Mahotsav Simon Go Back Freedom Fight - Sakshi

యూసుఫ్‌ మెహర్‌ అలీ స్వాతంత్య్ర సమరయోధులు. సోషలిస్టు నాయకుడు. 1942లో బాంబే మేయర్‌గా ఎన్నికయ్యారు. నేషనల్‌ మిలీషియా, బాంబే యూత్‌ లీగ్, కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ.. ఈ మూడూ మెహర్‌ అలీ స్థాపించినవే. అలీ అనేక ఉద్యమాలను నడిపించారు. రైతులు, కార్మికులు ఆయన సారథ్యంలో బ్రిటిష్‌ సామ్రాజ్యంపై ఉద్యమించారు. ‘సైమన్‌ గో బ్యాక్‌’ అనే నినాదం ఆయనదే. అంతేకాదు, భారత్‌ నుంచి బ్రిటిష్‌ పాలనకు చరమగీతం పాడిన ఉద్యమ గర్జన ‘క్విట్‌ ఇండియా’ అనే మాట ఆయన ఆలోచన నుంచి ఉద్భవించినదే. అలీ గాంధీజీకి అత్యంత సన్నిహితులు. ఈ క్విట్‌ ఇండియా ఉద్యమానికి నినాదం ఇవ్వడంతో పాటు, ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది కూడా అలీనే. ఆయన ముంబైలో 1903 సెప్టెంబర్‌ 23న జన్మించారు. 1950లో మరణించారు. నేడు ఆయన వర్ధంతి (జూలై 2).  

బోస్‌ అరెస్ట్‌ అయిన రోజు
రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటన్‌.. ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’తో కనీస సంప్రదింపులైనా లేకుండానే భారతీయులు బ్రిటన్‌ తరఫున యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించింది. ఆ నిర్ణయం తీసుకుంది వైశ్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌గో. బోస్‌ ఉగ్రుడయ్యారు. మీ యుద్ధంలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అని ప్రశ్నించారు. ఈ యుద్ధం మనం చేయొద్దు అని గాంధీజీకి చెబితే ఆయన స్పందించలేదు! చివరికి బోస్‌ కలకత్తాలో కలకలం రేపారు. లిన్‌లిత్‌గో నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా సమీకరణలు, ప్రసంగాలు చేశారు. ఆ రోజు జూలై 2,  1940. పోలీసులు బోన్‌ ను చుట్టు ముట్టారు. అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. జైల్లో వారం రోజులు నిరాహారదీక్ష చేశారు బోస్‌. దాంతో అతడిని విడుదల చేశారు. కానీ కలకత్తాలోని బోస్‌ ఇంటి చుట్టూ సి.ఐ.డి. పోలీసులను కాపలాగా పెట్టారు. అయినప్పటికీ మారువేషంలో తప్పించుకుని మద్ధతు కోసం హిట్లర్‌ను కలిసేందుకు బోస్‌ జర్మనీ వెళ్లారు.

సిరాజ్‌ గెలిచి ఉంటేనా!
సిరాజ్‌ ఉద్దౌలా బెంగాల్‌ చిట్ట చివరి నవాబు. ప్లాసీ యుద్ధంలో అతడి ఓటమి, భారత ఉపఖండంలో ఈస్టిండియా కంపెనీ పాలనకు ద్వారాలు తెరచింది. క్రమంగా ఉపఖండమంతటా వ్యాపించింది. సిరాజ్‌ యువకుడు. తన సైన్యంలో కమాండర్‌గా ఉన్న మీర్‌ జాఫర్‌  నమ్మకద్రోహం వల్ల యుద్ధంలో పట్టుబడి 24 ఏళ్లకే మరణించాడు. 1757 జూలై 2న ఈస్టిండియా సైన్యం అతడిని ఉరి తీసింది.  

(చదవండి: మహోజ్వల భారతి: వైద్యుడు, యోధుడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top