యూపీ అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగ ఆరోపణల తర్వాత ఇప్పుడు అదే తరహా ఆరోపణలు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ధామ్‌ను కూడా తాకాయి. ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.
బద్రీనాథ్ ఆలయానికి వచ్చే భక్తుల విరాళాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఒక సంస్థ సోషల్ మీడియాలో చేసిన తర్వాత ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన టెంపుల్ కమిటీ, అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు కూడా కోరినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది.. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను తీసిపారేయలేమన్నారు. అందుకే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే తెరపైకి వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. గోల్‌మాల్‌కు పాల్పడ్డాడని చెబుతున్న వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని.. ఆయన సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇక బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే అందుబాటులో ఉన్న ఫుటేజ్ స్పష్టంగా లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి విచారణ అవసరమని కమిటీ భావిస్తోంది.
ప్రస్తుతం సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు తీసుకుంటూ, విచారణ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన పంపినట్లు అధికారులు తెలిపారు. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు, సంబంధిత పక్షాల వాదనలు పరిశీలించి నివేదిక సమర్పించనుంది. విచారణలో ఏవైనా అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
అదే సమయంలో.. ఇది లక్షలాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం కావడంతో, నిర్ధారణ లేని ఆరోపణలు చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.


