Atiq Ahmad Wife Shaista Parveen Most Wanted By UP Police, Know Who Is She - Sakshi
Sakshi News home page

తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్‌ స్టర్‌.. ఇంతకూ అతీక్‌ భార్య పర్వీన్‌ ఎక్కడున్నారు?

Published Wed, Apr 19 2023 11:37 AM

Atiq Ahmad Wife Shaista Parveen Most Wanted By Police Who is she - Sakshi

లక్నో: పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్‌ స్టర్‌, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్(51)కోసం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే  పర్వీన్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్​ శాఖ ప్రకటించింది. అయితే అతిక్‌, అష్రఫ్‌ అంత్యక్రియల సమయంలో పర్వీన్‌ లొంగిపోతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె హాజరుకాలేదు. అతిక్‌ హత్య నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె కోసం జల్లెడపడుతున్నారు. 

కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే షైస్తా తన కొడుకు అసద్, భర్త అతిక్‌ ఇద్దరిని కోల్పోయింది. అసద్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన రెండు రోజుల తర్వాత, అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడ్డ లవ్లేష్ తివారి(22), అరుణ్ మౌర్య(18), మోహిత్ అలియాస్ సన్నీ(23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్‌ కమిటీని, సిట్‌ను నియమించారు. భర్తను హత్య చేశారని తెలియగానే షాయిస్తా పర్వీన్‌ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. 
చదవండి: గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం

ఎవరీ  షాయిస్తా పర్వీన్?
షాయిస్తా తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. 1996లో అతిక్‌ని పెళ్లి చేసుకునే ముందు షాయిస్తా ప్రపంచం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇంటర్‌ పూర్తి చేసిన ఆమెకు అంతకుముందు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు. అయితే 2009 నుంచి షాయిస్తా పేరు మీద ప్రయాగ్‌రాజ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు చీటింగ్‌ కేసులు కాగా ఒకటి హత్య కేసు.

మొదటి మూడు కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదవ్వగా నాలుగోది ఉమేష్ పాల్ హత్య కేసు. ఫిబ్రవరి 24న హత్యకు గురైన ఉమేష్  కేసులో ప్రధాన నిందితుల్లో షాయిస్తా ఒకరు. ఈమెతోపాటు భర్త అతిక్ అహ్మద్, ఇద్దరు కుమారులు, సోదరుడు అష్రఫ్ కూడా ఈ కేసులో నిందితుగా ఉన్నారు. 2021లో షైస్టా AIMIMలో చేరారు. అనంతరం 2023 జనవరిలో  బీఎస్పీలో చేరారు. ఈ సమయంలో తన భర్త అతిక్‌ ఎస్‌పీ అగ్రనేతతో స్నేహం కారణంగా క్రమశిక్షణ నేర్చుకోలేకపోయాడని తెలిపింది. అతిక్‌ ఎప్పుడూ బీఎస్‌పీని ఇష్టపడేవాడని.. ఆ పార్టీ అగ్రనేతలకు కూడా సహాయం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే తరువాత జరిగిన మేయర్ ఎన్నికలో శాయస్తాను పోటీ చేయకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు.

ఉమేష్ పాల్ హత్యకు ప్రణాళిక రచించడం, దాన్ని అమలు చేయడంతో షాయిస్తా కీలకంగా వ్యహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా అతీక్‌ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్‌ కీలకంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని తేలింది. 

సీఎం యోగికి షైస్తా లేఖ
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్వీన్ రాసిన లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను తప్పుగా ఇరికిస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఉమేష్ పాల్ హత్యకు మంత్రి నంద్ గోపాల్ గుప్తా కీలక సూత్రధారి అని ఆరోపించారు. అయితే పర్వీన్‌ ఫిబ్రవరి 27న లేఖ రాయగా.. అతిక్ మరణానంతరం వెలుగులోకి వచ్చింది. సీఎం ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోకపోతే నా భర్త, బావమరిది, కొడుకులను చంపేస్తామని లేఖలో రాసింది.

చదవండి: క్రిమినల్‌ కథా చిత్రమ్‌.. అతీక్‌ అహ్మద్‌కు వ్యవస్థ మొత్తం దాసోహమైందా?

Advertisement
Advertisement