పాపం.. ఆ కోడలి సాహసం వృథా!​

Assam Model Daughter In Law Niharika Das Shares Her Experience - Sakshi

కరోనా అనుమానంతో కొందరు అయినవాళ్లకే దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో.. తండ్రిలాంటి మామను కాపాడుకోవాలన్న ఆ కోడలి తాపత్రయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంలో నిహారికా దాస్​ అనే మహిళ.. కరోనా పాజిటివ్ సోకిన మామను మీపు మీద మోసుకుంటూ రెండు కిలోమీటర్లు వెళ్లిన ఫొటోలు వారం రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఉత్తమ కోడలిగా, ఈ కరోనా కష్టకాలంలో మనిషికి మనిషి సాయం అంటూ ఆమె స్టోరీపై కథనాలు వెలువడ్డాయి. కానీ,  పాపం ఆమె పడ్డ కష్టం వృథా అయ్యింది. ఆమె మామ చనిపోవడంతో పాటు కరోనా సోకిన ఆమె ఇప్పుడు చికిత్స తీసుకుంటోంది. 

గువాహటి​: నిహారికా దాస్.. ఆదర్శ కోడలు ట్యాగ్ లైన్​తో దేశం మొత్తం ప్రశంసలు అందుకుంది. ఓ మీడియా ఛానెల్​ ఆమెను ఫోన్​ ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించినప్పుడే.. తన ఫొటోలు, వీడియోలు వైర​ల్ అయిన విషయం ఆమెకు తెలిసిందట. అంతేకాదు ఆ సంతోషంలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న ఆమె మామకు ఆ ఫొటోల్ని చూపించి ఆమె సంబుర పడింది కూడా. ‘నన్ను మోసేంత గుండె ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అని ఆ పెద్దాయన చెప్పిన మాటల్ని మీడియాతోనూ పంచుకుంది నిహారిక. అయితే ఆమె ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పరిస్థితి క్షీణించి ఆమె మామ కన్నుమూశాడు. 

 ‌‌‘‘మా ఫొటోలు షేర్​ చేయడంతో పాటు మనిషికి మనిషి సాయం చేసుకోవాలనే సందేశం ఇవ్వడం బాగుంది. కానీ, నా విషయంలోనే అది జరగనందుకు బాధగా ఉంది. నా కష్టం చూసి చుట్టూ చేరి ఫొటోలు తీశారే తప్ప.. సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఫొటోలు చూడగానే నేను ఒంటరిననే భావన కలిగింది. నా గుండె భారంగా అనిపించింది. తల్లిదండ్రులే కాదు.. అయినవాళ్లు, కానీవాళ్లు అనే తేడా లేకుండా ఎవరికైనా సాయం అందించడం మనిషి కర్తవ్యం. అది నెరవేరనంత వరకు మానవత్వం గురించి ఎంత మాట్లాడుకున్నా వ్యర్థమే”  - నిహారికా దాస్​

ఏం జరిగిందంటే.. 
రహా ఏరియాలో తులేశ్వర్​ దాస్​ పోకవక్కలను అమ్ముతుంటాడు. అతని కొడుకు సిలిగురి(వెస్ట్ బెంగాల్​)లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో ఆ ఇంట్లో తులేశ్వర్​, కోడలు నిహారికా దాస్ ఉంటున్నారు. జూన్ 2న తులేశ్వర్​ ఆరోగ్యం క్షీణించగా.. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిహారిక ప్రయత్నించింది. అయితే ఆ పరిస్థితి చూసి ఆటో, రిక్షా వాలాలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరోదారి లేక ఆమె భుజాన వేసుకుని నాగావ్​ హెల్త్ సెంటర్​కు తీసుకెళ్లింది. ఆ టైంలో అంతా ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు. తులేశ్వర్, నిహారికలను టెస్ట్ చేసిన డాక్టర్లు ఇద్దరికీ పాజిటివ్ సోకిందని చెప్పారు. తులేశ్వర్​ పరిస్థితి చూసి హాస్పిటల్ తరలించాలని చెప్పారు. అయితే వయసు మళ్లిన మామగారిని ఒంటరిగా వదిలేసేందుకు ఆమె మనసు ఒప్పుకోలేదు. దీంతో ఓ మినీ వ్యాన్​ మాట్లాడుకుని అక్కడికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది నిహారికా. తులేశ్వర్ పరిస్థితి విషమించడంతో జూన్​ 5న గువాహటి మెడికల్ కాలేజ్​ హాస్పిటల్​కు తరలించారు. చివరికి సోమవారం రాత్రి కరోనాతో పోరాడుతూ తులేశ్వర్ కన్నుమూయగా.. నిహారిక ట్రీట్​మెంట్ కొనసాగుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top