
డిస్పూర్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ అదుపులోకి వస్తున్నా మరణాలు పెరగడం ఆందోళన కలిగించే విషయమే. కరోనా బారిన పడిన వారు పెద్ద ఎత్తున మృతి చెందుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనాతో బాధపడుతూ మృత్యువాత పడ్డారు. ఆయనే అసోంకు చెందిన లెహో రామ్ బొరో. గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రి (జీఎంసీహెచ్)లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అండ్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో తముల్‌పూర్ స్థానం నుంచి గెలిచాడు. ఎమ్మెల్యేగా ఎన్నికై నెల కూడా కాకముందే ఆయన కన్నుమూశాడు. ఆయన మృతికి మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవల్ సంతాపం ప్రకటించారు. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన నాయకులు నివాళులర్పించారు.