జ్ఞానవాపి మసీద్‌ సర్వే: బాబ్రీని పొగొట్టుకున్నాం.. మరొకటి కోల్పోం!: కోర్టు ఆదేశాలపై ఒవైసీ

Asaduddin Owaisi Reacts On Gyanvapi Mosque Varanasi Court Orders - Sakshi

లక్నో: జ్ఞానవాపి మసీద్‌ వ్యవహారంలో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మసీదు ప్రాంగణంలోని వుజు ఖానా(కొలను)లో శివలింగం బయట పడడం, ఆ ప్రాంతాన్ని సీజ్‌ చేసి ఎవరినీ అనుమతించకూడదంటూ ‍స్థానిక కోర్టు అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించడం లాంటి పరిణామాలు వారణాసిలో వేడిని పుట్టించాయి. 

ఈ క్రమంలో ఒవైసీ స్పందిస్తూ.. ముస్లింలు ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయారని, మరో మసీదును పోగొట్టుకోబోమని అన్నారు. ఈ సందర్భంగా వారణాసి కోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. మసీదులో వీడియోగ్రఫీ సర్వే.. ప్రార్థనామందిరాల ప్రత్యేక చట్టం 1991ను ఉల్లంఘించడమే కాదు.. బాబ్రీ మసీద్‌ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పును సైతం తప్పుబట్టినట్లు అవుతుంది. అగష్టు 15, 1947 సమయంలో అక్కడ ఏ ప్రార్థనా స్థలం ఉంటే.. అదే కొనసాగాలని చట్టం చెబుతోంది.

ఇప్పటికే ఓ మసీదును కోల్పోయాం. మరొకటి కోల్పోయేందుకు సిద్ధంగా లేం అంటూ వ్యాఖ్యానించారు ఒవైసీ. జ్ఞానవాపి ఒక మసీదుగానే ఎప్పటికీ ఉంటుందంటూ పేర్కొన్నారాయన. ఒవైసీ కంటే ముందు జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై మండిపడ్డారు. వాళ్లంతా మసీదుల వెంటే పడుతున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు ఆమె.

సంయమనం పాటించండి

కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. చరిత్రను ఒకసారి తిరగేయండి. శాంతి, సోదరభావాన్ని పాటించండి. కోర్టులో ఈ వ్యవహారం ఉన్నందున.. జోక్యం చేసుకుని పరిస్థితిని మరోలా మార్చకండంటూ లేఖి విజ్ఞప్తి చేశారు.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగర్‌ గౌరీ ఆలయంలో నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇ‍వ్వాలంటూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మొదలైంది. దీనిపై మూడు రోజులు పాటు కోర్టు ఆదేశానుసారం వీడియోగ్రఫీ సర్వే జరిగింది. సోమవారం సర్వే ముగియగా.. మసీదులో ఉన్న కొలను నుంచి శివలింగం బయటపడడంతో.. కోర్టు మళ్లీ జోక్యం చేసుకుని ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయమని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రాంగణం మొత్తం కాశీ విశ్వనాథ్‌ ఆలయానికి చెందినదే అని.. మసీదు అందులో ఓ భాగం మాత్రమే అని దాఖలైన ఓ పిటిషన్‌ 1991 నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉండడం విశేషం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top