Manish Sisodia, Satyendar Jain: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్‌ రాజీనామా

Arrested AAP Ministers Manish Sisodia Satyendar Jain Quit Delhi Cabinet - Sakshi

న్యూఢిల్లీ:  ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మంగళవారం రాజీనామా ప్రకటించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్‌ సిసోడియా రాజీనామా చేశారు. అదే విధంగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇద్దరి రాజీనామాలను ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమోదించారు.

కాగా మద్యం కుంభకోణం కేసులో మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేయగా.. మనీలాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌ కొన్ని నెలలుగా జైలులో ఉన్నారు. ఇక కేజ్రీవాల్‌ కేబినెట్‌లో నెంబర్‌ 1, నెంబర్‌2గా ఉన్న ఇద్దరు మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ రాజీనామాలతో ఆప్‌ సర్కార్‌కు భారీ షాక్‌ తగిలినట్లైంది.

10 నెలలుగా సత్యేందర్‌ జైన్‌ జైలులో ఉండటంతో ఆయన నిర్వహించిన ఆరోగ్యశాఖతో సహా మొత్తం 18 మంత్రిత్వశాఖలకు మనీష్‌ సిసోడియానే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అయితే సిసోడియాను ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆదివారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిసోడియాను విచారించేందుకు అయిదు రోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. 

అరెస్టయిన నేతలను ఇంకా ఢిల్లీ కేబినెట్‌లో ఎందుకు కొనసాగనిస్తున్నారంటూ బీజేపీ చేస్తోన్న విమర్శల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు రాజీనామా సమర్పించారు. తాజా పరిణామంతో ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్‌లో సీఎం కేజ్రీవాల్‌తో సహా ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే కేబినెట్‌ విస్తరణ చేపట్టి కొత్త మంత్రులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు చుక్కెదురు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top