
బెంగళూరు: యాపిల్ ఫోన్ల రేట్లే కాదు.. యాపిల్ ఆఫీసుల రెంట్లు, లీజులు కూడా ఓ రేంజులో ఉంటాయి. తాజాగా బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్ నుంచి యాపిల్ పదేళ్లపాటు లీజుకు తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఎంబసీ జెనిత్ భవనంలోని మొత్తం 9 అంతస్తుల్లో (5 నుంచి 13వ అంతస్తు వరకూ) యాపిల్ కార్యాలయం పనిచేస్తుంది. దీని రెంట్, పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలుపుకుని పదేళ్లకు రూ.వెయ్యి కోట్లకు పైనే చెల్లించనుంది. 2025 ఏప్రిల్ 3 నుంచి ఈ లీజు అమల్లోకి వచ్చింది. ఒప్పందంలో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.31.57 కోట్లను యాపిల్ ఇప్పటికే చెల్లించింది.