6 నెలల్లో యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు | Anti drone systems in 6 months to curb smuggling of narcotics : Amit Shah | Sakshi
Sakshi News home page

6 నెలల్లో యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు

May 27 2026 2:42 PM | Updated on May 27 2026 2:48 PM

Anti drone systems in 6 months to curb smuggling of narcotics : Amit Shah

 డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కట్టడికి చర్యలు:  హోం మంత్రి అమిత్‌ షా వెల్లడి  

బికనెర్‌: సరిహద్దుల ఆవలి నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆరు నెలల్లోగా యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మన భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ల జాడ కనిపెట్టి అందులోని వస్తువులు, సరుకులు ఎవరు అందుకుంటున్నదీ గుర్తించడం అత్యంత ముఖ్యమన్నారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు, పౌర యంత్రాంగం మెరుగైన సమన్వయంతో ఇలాంటి ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనవచ్చని మంత్రి వివరించారు. సరిహద్దు సమగ్ర భద్రతకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌), సాయుధ బలగాలు, స్థానిక యంత్రాంగం, పౌరుల మధ్య బహుళ అంచల ‘ఫోర్‌ పాయింట్‌ సెక్యూరిటీ గ్రిడ్‌’ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి సమన్వయం వల్లనే సంపూర్ణ సురక్షిత సరిహద్దు అనే సంకల్పం నెరవేరుతుందని స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే బిహార్, గుజరాత్, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో చర్యలు ప్రారంభించామని వివరించారు. 

డ్రోన్లు, ఇతర మార్గాల్లో దొంగచాటుగా జరిగే మాదకద్రవ్యాలు, ఆయుధాలను రవాణాను అడ్డుకునే విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం మన బాధ్యతని అన్నారు. మంగళవారం అమిత్‌ షా రాజస్తాన్‌లోని బికనెర్‌ జిల్లా సాంచులోని బోర్డర్‌ పోస్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్‌ఎఫ్‌ జవాన్లనుద్దేశించి మాట్లాడారు. సరిహద్దులకు 50 కిలోమీటర్ల పరిధిలో వెలిసే అక్రమ నిర్మాణాలు, అసాధారణమైన మార్పులు, అనుమానాస్పద కార్యకలాపాలపై బీఎస్‌ఎఫ్‌ యంత్రాంగం ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం ఔట్‌పోస్ట్‌ వద్ద మహిళా బ్యారెక్‌లను ప్రారంభించారు. 2030కల్లా అన్ని బోర్డర్‌ పోస్టుల్లోనూ మహిళా సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు. మహిళా సిబ్బంది విధుల్లో అంచనాలకు మించి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారంటూ కొనియాడారు. 1965 యుద్ధంలో మన జవాన్లు పాకిస్తాన్‌ బలగాల దాడులను ఎదుర్కొంటూ సాంచు ఔట్‌పోస్ట్‌ను కాపాడుకోవడంలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ వారి త్యాగాలను స్మరించుకున్నారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement