
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసులు పెరుగుతుండడంతో అదే స్థాయిలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగిపోతోంది. ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సింగపూర్, యూఈఏతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం.
మూసివేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మళ్లీ తెరవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు లేఖలు రాసింది. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తి పెంపు, సరఫరాపై పలు సూచనలు చేశారు. సింగపూర్, యూఏఈతోపాటు ఇతర దేశాల నుంచి హై కెపాసిటీ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ రవాణా విమానాల ద్వారా దిగుమతి చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు.