వెనక్కి పంపేసిన అమెరికా
న్యూఢిల్లీ: తాను నడపాల్సిన విమానం అమెరికాలో ఉండటంతో అక్కడికి వేరే విమానంలో ప్రయాణికుడిలా చేరుకున్న ఒక భారతీయ పైలట్‌ను అమెరికా ప్రభుత్వం బలవంతంగా వెనక్కి తిప్పిపంపింది. ప్రయాణసమయంలో అతని వద్ద నిషేధిత గంజాయిని పట్టుకున్నామని, నిబంధనల మేరకు అతడిని స్వదేశానికి పంపేశామని అమెరికా వెల్లడించింది. తమ పైలట్‌ను వెనక్కిపంపిన విషయాన్ని ఎయిర్‌ఇండియా విమానయాన సంస్థ సైతం దృవీకరించింది.
‘‘ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఏప్రిల్ 14వ తేదీన మా కోపైలట్ ఒకరు వెళ్లారు. అక్కడికి వెళ్లాక అతను విధుల్లో చేరాల్సి ఉంది. అయితే నిషేధిత(గంజాయి) పదార్థం అతని వెంట ఉందని నిర్ధారణ కావడంతో అమెరికా అతడిని వెనక్కి పంపేసింది’’అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు, అంతర్గత దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. సంస్థ కఠిన నిబంధనావళిని అనుసరిస్తూ అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అతని పేరు, స్వస్థలం, గతంలో ఎక్కడ పనిచేశా వంటి తదితర వివరాలు ఏవీ తెలియరాలేదు.


