అగ్నిపథ్‌ నిరసనలు: చాలా దేశాల్లో అమలు అవుతోంది ఇదే! అపోహలు.. వాస్తవాలు

Agnipath Protests: BJP Release Myths Facts Amid Violent Protests - Sakshi

బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా దేశంలో చాలా చోట్ల రెండో రోజు అగ్నిపథ్‌ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. బీహార్‌లో అయితే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంతో పాటు రైళ్లను సైతం తగలబెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే అరుణా దేవీ తృటిలో దాడి నుంచి తప్పించుకున్నారు. బీజేపీ మాత్రం అగ్నిపథ్‌ యువత మంచి కోసమే అని, చాలా దేశాల్లో అమలు అవుతోంది ఇదేనని చెప్తోంది.   

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ప్రోగ్రామ్‌పై నెలకొన్న అపోహలు, వాస్తవాలు పేరిట ఓ రిపోర్ట్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఓ అనధికారిక ప్రకటనతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో మొదటిది.. అగ్నివీరుల భవిష్యత్తు పదిలంగా ఉండదు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. దానికి వాస్తవం పేరిట.. సాయుధ బలగాల్లో 4 ఏళ్లు సర్వీస్ చేసిన వారు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే కేంద్రం వారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. 

అంతేకాదు, తదుపరి చదువుల కోసం బ్రిడ్జింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కూడా ఈ నాలుగేళ్ల సర్వీస్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్వీస్‌లో పాల్గొన్న యువతకు సీఏపీఎఫ్, రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు.

రెండోది.. అగ్నిపథ్ వల్ల యువతకు అవకాశాలు తగ్గుతాయి.. నిజానికి నాలుగేళ్లపాటు దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్నేళ్లలో సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్ల కంటే అగ్నివీరుల రిక్రూట్‌మెంట్లు మూడు రెట్లు పెరుగుతాయి.

మూడోది.. అగ్నిపథ్ పథకం కారణంగా రెజిమెంటల్ బాండింగ్ పై ప్రభావం పడుతుంది. కానీ, అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదని, నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత ఎంపిక అవుతుందని కేంద్రం అంటోంది.

నాలుగోది.. సాయుధ బలగాల సామర్థ్యం క్షీణిస్తుంది. ఈ తరహా స్వల్పకాలిక నియామక విధానం చాలా దేశాలలో ఉంది. ఈ విధానాన్ని ఇప్పటికే చాలాచోట్ల విజయవంతంగా పరీక్షించాయి. యువత, శక్తివంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమంగా నిలుస్తుంది. మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. తద్వారా.. ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్‌ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది.

ఐదవది.. 21 ఏళ్ల యువతలో పరిపక్వత ఉండదు. వారిపై సైన్యం ఆధారపడటం అవివేకమే. అయితే ప్రపంచంలోని చాలా దేశాల సైన్యాలు తమ యువతపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏ సమయంలో చూసుకున్న ఎక్స్‌పీరియన్స్‌ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు ఉండరు. ప్రస్తుత పథకం చాలా నెమ్మదిగా సుదీర్ఘ కాలంలో యువకులు, ఎక్స్‌పీరియన్స్‌డ్‌ పర్యవేక్షక ర్యాంక్‌ల అధికారులు వందకు సగం సగం ఉండేలా చేస్తుంది.

ఆరవది.. అగ్నివీరులు సమాజానికి ప్రమాదకారులుగా మారతారు. ముఖ్యంగా వారు ఉగ్రవాదులతో చేతులు కలుపుతారు. ఇలాంటి ప్రచారం.. భారత సాయుధ బలగాల ధర్మాన్ని, విలువలను అవమానించడమే. నాలుగేళ్లుగా యూనిఫాం ధరించి భారత మాతకు సేవలందించిన యువకులు జీవితాంతం దేశం కోసమే పని చేస్తారు. కానీ దేశానికి ద్రోహం చేయరు. అంతెందుకు, ఏటా వేలాది మంది సాయుధ బలగాల నుంచి పదవీ విరమణ పొందుతున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ దేశ వ్యతిరేక దళాలలో చేరిన దాఖలాలు లేవు. 

ఏడవది..  మాజీ సాయుధ దళాల అధికారులను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తీసుకోకుండా పథకం ప్రకటించారు. దీంతో మాజీ అధికారులందరూ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు అని. కానీ, కేంద్రం ఈ పథకం గురించి ప్రస్తుతం సేవలందిస్తున్న సాయుధ దళాల అధికారులతో గత రెండేళ్లుగా సంప్రదింపులు జరిపింది. మిలిటరీ అధికారులతో కూడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఈ ప్రతిపాదనను రూపొందించారు. నిజానికి దాదాపు అందరూ మాజీ అధికారులందరూ అగ్నిపథ్ పథకం ప్రయోజనాలను గుర్తించి దానిని సంతోషంగా స్వాగతించారు కూడా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top