
దాయాది దేశ ఆర్థిక పునాదులను పెకళించేందుకు భారత్ యత్నం
ఎఫ్‌ఏటీఎఫ్ ‘గ్రే’లిస్ట్‌లో పాక్‌ను చేర్చేందుకు ప్రయత్నం
ఐఎంఎఫ్ భారీ నిధులకు బ్రేకులేసేందుకు ప్రణాళిక
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.
ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్‌్కఫోర్స్‌కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్‌కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్‌ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది.
గతంలో పాక్‌పై గ్రే లిస్ట్ కొరడా
విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్‌ను 2018 జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్‌చేసింది.
దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్‌లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్‌ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్‌ఏటీఎఫ్‌పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్‌లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి.
ఐఎంఎఫ్‌పైనా కేంద్రం ఒత్తిడి
స్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.
పాకిస్తాన్‌కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.