ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఆ రెండింటి కన్నా డేంజర్‌

After Black And White Fungus Yellow Fungus Infection Cases Reported in India - Sakshi

వెలుగులోకి యెల్లో ఫంగస్‌ కేసులు

బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌లకన్నా మరింత ప్రమాదం అంటున్న వైద్యులు

లక్నో: కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌ రూపంలో మరో ప్రమాదం భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఫంగస్‌ బారిన పడిన వారు ప్రారంభంలోనే దాన్ని గుర్తించకపోతే.. ప్రాణాలే పోతున్నాయి. ఈ రెండు ఫంగస్‌లు జనాలను భయభ్రాంతలకు గురి చేస్తుండగా.. తాజాగా యెల్లో ఫంగస్‌ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తుంది. బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌లకన్నా ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలిసారి ఈ యెల్లో ఫంగస్‌ కేసును గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం బాధితుడికి నగరంలోని ప్రసిద్ధ ఈఎన్‌టీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

యెల్లో ఫంగస్ లక్షణాలు..
బద్ధకం, ఆకలి తక్కువగా ఉండటం.. లేదా అసలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం యెల్లో ఫంగస్‌లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఫంగస్‌ తీవ్రమైతే చీము కారడం, శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం, పోషకాహార లోపం, అవయవాలు వైఫల్యం చెందడం, చివరికి నెక్రోసిస్ కారణంగా కళ్ళు పోవడం జరుగుతుంది అంటున్నారు వైద్యులు. 

యెల్లో ఫంగస్ ఒక ప్రాణాంతక వ్యాధి.. ఎందుకంటే ఇది అంతర్గతంగా మొదలవుతుంది. అందువల్ల పైన చెప్పిన ఏదైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు.

యెల్లో ఫంగస్‌ వ్యాప్తికి కారణాలు..
యెల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా అపరిశుభ్ర వాతావరణం వల్ల వ్యాప్తిస్తుంది. కనుక ఇంటిని.. చుట్టుపక్కల పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి.

ఇంటిలోని  తేమ కూడా బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి. సరైన తేమ స్థాయి 30% నుంచి 40% వరకు ఉంటుంది. కనుక ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. 

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుర్వేద మందు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top