లేడీ రజనీకాంత్‌.. సూపర్‌ టాలెంట్‌.. ‘వైరస్‌’ను గుర్తు చేసింది!

Aadi Swaroopa: Ambidexterity World Record Holder, Mangaluru Multitalented Girl - Sakshi

ఈ అమ్మాయి గురించి తెలిసిన వారందరూ ఆమెను ‘లేడీ రజనీకాంత్‌’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ యువతి పేరు ఆది స్వరూప. రెండు చేతులను సరి సమానంగా ఉపయోగించడం ఈమె ప్రత్యేకత. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఈ యువతి తన స్పెషల్‌ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 

ఒకే సమయంలో రెండు చేతులతో ఇంగ్లీషు, కన్నడ, తుళు, హిందీ, మళయాలం భాషల్లోనూ రాయగలదు. ఒక నిమిషంలో తన రెండు చేతులతో ఒకే దిశలో 45 పదాలను లిఖించి ఎక్స్‌క్లూజివ్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. లతా ఫౌండేషన్ ఈ రికార్డును గుర్తించింది. అంతేకాదు కళ్లగు గంతలు కట్టుకుని కూడా రెండు చేతులతో రాసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్వరూప సాధించిన రికార్డుకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వీడియో ట్విటర్‌లో రీ షేర్‌ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. 

నెటిజన్ల ప్రశంసలు
ఆమెను ‘లేడీ రజనీకాంత్‌’ అని ఒకరు ప్రశంసించగా.. ‘త్రి ఇడియట్స్‌’ హిందీ సినిమాలో  ‘వైరస్‌’పాత్ర చేసిన బొమన్‌ ఇరానీ గుర్తుకొచ్చారని మరో నెటిజన్‌ పేర్కొన్నారు. ఆమె ప్రతిభ చాలా ప్రత్యేకమైందని మరికొంత మంది మెచ్చుకున్నారు. స్వరూప గురించి తెలిసిన వారంతా ఆమె గిన్నీస్‌ రికార్డు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. 

బహుముఖ ప్రతిభ
ఆది స్వరూప.. బహుముఖ ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. నటన, చిత్రలేఖనం, అనుకరణ(మిమిక్రీ)లోనూ రాణిస్తోంది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ 2021లోనూ తన పేరును లిఖించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా పర్యాటక ప్రాంతాల విహారానికి వెళ్లే స్వరూపకు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ప్రేమ. అన్నట్టు తన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది.

పాకిస్తాన్‌ బౌలర్‌ రికార్డు
రెండు చేతులతో సమానంగా ఉపయోగించి పాకిస్తాన్‌ బౌలర్‌ యాసిర్ జాన్‌ 2017లో గిన్నీస్‌ రికార్డుకు ఎక్కాడు. తన కుడి చేతితో 145, ఎడమ చేతితో 135 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్‌ చేసి అతడు ఈ ఘనత సాధించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top