టీకా వద్దనేవారు తగ్గిపోతున్నారు!

7percent of India adult population still reluctant of Covid vaccine - Sakshi

సందేహరాయుళ్ల సంఖ్య తగ్గిందన్న సర్వే

న్యూఢిల్లీ: భారత జనాభాలో కోవిడ్‌ టీకాలపై అపనమ్మకం వేగంగా తగ్గుతోందని ఆన్‌లైన్‌ సర్వే సంస్థ లోకల్‌ సర్కిల్స్‌ తెలిపింది. దేశ జనాభాలో టీకాలపై సందేహాలున్న వారి సంఖ్య కేవలం 7 శాతానికి చేరిందని, టీకాలివ్వడం ఆరంభమయ్యాక ఇదే కనిష్ఠ స్థాయని సర్వే తెలిపింది. 301 జిల్లాల్లో 12,810 మందిని వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించారు. వీరిలో 67 శాతం మగవారు కాగా 33 శాతం మంది మహిళలు.  వీరిలో ఇప్పటివరకు టీకా తీసుకోనివారిని ప్రశ్నించగా 46 శాతం మంది కనీసం తొలిడోసైనా త్వరలో తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

కేవలం 27 శాతం మంది మాత్రం ఇంకా టీకాపై నమ్మకం కుదరడం లేదని, మరింత డేటా వచ్చాక టీకా తీసుకుంటామని చెప్పినట్లు సంస్థ అధిపతి సచిన్‌ తపారియా తెలిపారు. భారత్‌లో వయోజనుల జనాభా దాదాపు 94 కోట్లు కాగా వీరిలో 68 కోట్ల మంది కనీసం ఒక్కడోసైనా టీకా తీసుకున్నవారున్నారు. సర్వే ఫలితాలను దేశజనాభాతో పోల్చిచూస్తే 7 శాతం మంది అంటే సుమారు 26 కోట్లమంది ఇంకా ఒక్కడోసు కూడా తీసుకోలేదు. వీరిలో కొంతమంది త్వరలో టీకా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్‌ ఆరంభమైనప్పుడు దేశ జనాభా(వయోజన)లో దాదాపు 60 శాతం మంది టీకాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌ అనంతరం టీకాలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం ఉచితంగా టీకాల పంపిణీ ఆరంభించడం కూడా ప్రజల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాచుర్యం లభించేందుకు కారణమైంది.  

ఎందుకు వద్దంటే...
టీకాలను వద్దనే సందేహరాయుళ్లు తమ వ్యతిరేకతకు పలు కారణాలు చెబుతున్నారు. కొత్తవేరియంట్ల నుంచి టీకా కల్పించే రక్షణపై సందేహాలను వెలుబుచ్చుతున్నారు. వీరి
అనుమానాల్లో కొన్ని...

► సరైన పరీక్షలు పూర్తికాకముందే హడావుడిగా టీకాలకు అనుమతులిచ్చారు, కాబట్టి వాటితో లభించే రక్షణపై సందేహాలున్నాయి.  
► టీకాలతో సైడ్‌ఎఫెక్టులుంటాయి, కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు టీకాతో అనవసర సమస్యలు వస్తాయి.
► కొత్తగా వచ్చే వేరియంట్లను ప్రస్తుత టీకాలు ఎలాగూ రక్షించలేవు. అందువల్ల మరింత శక్తివంతమైన వ్యాక్సిన్లు వచ్చాక ఆలోచిద్దాం.
► మాకు బ్లడ్‌ క్లాటింగ్‌ సమస్యలున్నాయి అందుకే టీకాకు దూరంగా ఉంటున్నాము.
► మానవ పయ్రత్నం ఏమీ లేకుండా ఎలా వచ్చిందో అలాగే కోవిడ్‌ మాయం అవుతుంది, దానికోసం టీకాలు అవసరం లేదు.

టీకాలపై మారుమూల ప్రాంతాల్లో వ్యాపించిన మూఢనమ్మకాలు, అభూత కల్పనలు కొందరిని టీకాకు దూరంగా ఉంచుతున్నాయి. వ్యాక్సినేషన్‌ తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారింది. జనాభాలో వీలైనంత ఎక్కువమందికి టీకాలు అందితే హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top