లక్నో: మైనర్లపై లైంగిక దాడుల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. మానవ మృగాలు మారడం లేదు. అభం శుభం తెలియని పసిపిల్లలను తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. ఇటువంటి మృగాలను ఏలా శిక్షించాలి వారిని ఏవిధంగా మార్చాలి అన్నది ప్రస్తుతం ప్రభుత్వాలకు సైతం పెద్ద సవాలుగానే మారింది. ఇక, తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఆరేళ్ల పసికందుని మానవమృగాలు వేటాడాయి. చిన్నారిపై ఇద్దరు కిరాతకులు అత్యాచారం చేశారు. ఆపై ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి మేడపై నుంచి కిందకి విసిరారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారి ఆస్పత్రికి వెళ్లే లోపే కన్నుమూసింది.
ఈ ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. బులందషహర్‌లో ఒక ఇంటి మేడపై రాజు, వీరు కశ్యప్ అనే ఇద్దరు యువకులు అద్దెకుంటారు. అయితే అదే మేడపై ఓ ఆరేళ్ల చిన్నారి ఆడుకోవడానికి వెళ్లింది. అప్పుడే అక్కడే ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు పసికందుకై కిరాతకంగా అత్యాచారం చేశారు. అనంతరం అనుమానం రాకుండా ఉండడానికి మేడపై నుంచి తోసేసారు. దీంతో ఆ చిన్నారి భవనం వెనక అపస్మారక స్థితిలో పడి ఉంది. ఎంతసేపైనా తమ పాప రాకపోవడంతో తన కోసం వెతికిన తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను చూసి దిగ్బ్రాంతికి గురయ్యారు. తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా పాపను పరీక్షించిన వైద్యులు తను అప్పటికే మృతిచెందిందని తెలిపారు.
దీంతో పైనున్న ఇద్దరు యువకులపై అనుమానం వచ్చి పాప తల్లిదండ్రులు పోలీసులకు సమచారమిచ్చారు. అయితే నిందితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వారి కోసం పోలీసులు ఆపరేషన్ ప్రారంభించి వారున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై ఆ దుండగులు కాల్పులు జరపగా, పోలీసులూ ఎదురుకాల్పులు జరిపి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాథమిక విచారణలో వారిద్దరూ నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుగుతున్నామని పేర్కొన్నారు.


