పశ్చిమ బెంగాల్ రాజకీయం ఎప్పుడూ సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు నేతలందరి దృష్టి ఆ 57 నియోజకవర్గాలపైనే నిలిచింది. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘనవిజయం సాధించినప్పటికీ, ఈ సీట్ల ఫలితాలను పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ, నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా..
రాష్ట్ర అధికార పీఠాన్ని నిర్ణయించడంలో కేవలం 8,000 లోపు ఓట్ల తేడాతో గెలిచిన ఈ 57 సీట్లు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఈ స్వల్ప ఓట్ల తేడా అటు ఇటు అయితే బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గత 2021 ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, ఈ 57 స్థానాల్లో గెలుపోటములు వెంట్రుక వాసిలో జరిగాయి. వీటిలో సగటున 8,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతోనే అభ్యర్థులు గట్టెక్కారు. మరీ ముఖ్యంగా, 19 నియోజకవర్గాల్లో అయితే మెజారిటీ 3,000 ఓట్ల లోపే ఉండటం గమనార్హం. ఈ 57 కీలక స్థానాల్లో గతంలో టీఎంసీ 29 సీట్లు గెలవగా, బీజేపీ 28 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే రెండు పార్టీల మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీ ఉన్న 19 సీట్లలో బీజేపీ 12 చోట్ల విజయం సాధించగా, టీఎంసీ 7 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, 2026లో ఈ 57 స్థానాల్లో చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా అది ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే అసలైన కురుక్షేత్రం
ఈ ఉత్కంఠభరిత నియోజకవర్గాల్లో అత్యధికంగా 47 సీట్లు దక్షిణ బెంగాల్‌లోనే ఉన్నాయి. ఉత్తర బెంగాల్‌లో కేవలం 10 స్థానాలు మాత్రమే ఇటువంటి స్వల్ప మెజారిటీ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన పుర్బా మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, పురూలియా, పశ్చిమ బర్థమాన్ జిల్లాలు ఈసారి ప్రధాన యుద్ధభూమిగా మారనున్నాయి. బంకురా, పశ్చిమ బర్థమాన్ జిల్లాల్లో ఇటువంటి సీట్లు ఆరేసి చొప్పున ఉండగా.. మిగిలిన మూడు జిల్లాల్లో ఐదు చొప్పున ఉన్నాయి.
గత ఎన్నికల్లో షాకింగ్ మెజారిటీలు
నందిగ్రామ్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేవలం 1,956 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కుల్తీ: ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 679 ఓట్లతో గట్టెక్కారు.
దంతాన్: టీఎంసీ కేవలం 623 ఓట్లతో ఇక్కడ విజయాన్ని అందుకుంది.
ఘటల్: బీజేపీ కేవలం 966 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచింది.
దిన్హాటా: కూచ్ బెహార్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నిశిత్ ప్రామాణిక్ కేవలం 57 ఓట్ల తేడాతో గెలవడం ఒక సంచలనం. అయితే ఆయన రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 1.64 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలవడం గమనార్హం.
మారిన రాజకీయ సమీకరణలు
2026 సమరంలో పాత లెక్కలు చెల్లుతాయని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈసారి పోటీ మరింత క్లిష్టంగా మారనుంది. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉండగా, సీపీఐ(ఎం) - ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేస్తున్నాయి. వీరికి తోడుగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్‌కు చెందిన ఏజేయూపీ కూటమి ముస్లిం ఓట్ల సమీకరణలను మార్చే అవకాశం ఉంది. ఓట్లు ఇలా చీలిపోవడం వల్ల స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాల్లో ఫలితాలు ఎటువైపు తిరుగుతాయోనన్న టెన్షన్ పార్టీల్లో నెలకొంది.
పార్టీల ధీమా.. పరస్పర విమర్శలు
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ ఛటోపాధ్యాయ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేకత, ఓటర్ల జాబితా సవరణ తమకు కలిసి వస్తుందని, తాము 80 శాతానికి పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఎంసీ ప్రతినిధి అరూర్ చక్రవర్తి ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా కొన్ని వర్గాల ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు తమవైపే ఉన్నారని, స్వల్ప మెజారిటీ సీట్లలో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2021లో 213 సీట్లతో భారీ విజయం సాధించిన టీఎంసీకి, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీకి మధ్య 2026 ఎన్నికలు చావో రేవో అన్నట్లు ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి


