మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి | 5 bodies found after massive avalanche at Ladakh | Sakshi
Sakshi News home page

మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి

Mar 28 2026 8:01 AM | Updated on Mar 28 2026 12:53 PM

5 bodies found after massive avalanche at Ladakh

లడఖ్: లడఖ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా విరిగిపడిన భారీ మంచు పెళ్లలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. జోజిలా పాస్ సమీపంలోని ద్రాస్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కింద 15 వాహనాలు పూర్తిగా కూరుకుపోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

నిముషాల్లోనే మారిన దృశ్యం
ద్రాస్ పరిధిలోని ‘క్యాప్టెన్-టర్న్’ వద్ద మధ్యాహ్నం సమయంలో భారీ హిమపాతం కురిసింది. రహదారిపై వాహనాలు వెళ్తుండగానే ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగిపడటంతో, ప్రయాణికులు అప్రమత్తం అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. మంచు కింద మరికొన్ని వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌డీఎఫ్‌)బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ)బృందాలు రంగంలోకి దిగాయి. మేఘా టన్నెల్ సిబ్బంది సహకారంతో సుమారు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సోనామార్గ్- ద్రాస్.. ఇలా రెండు వైపుల నుండి మంచును తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అయితే కశ్మీర్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని సమాచారం.

ఇది కూడా చదవండి: Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు!

Advertisement
 
Advertisement
Advertisement