Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు! | Chandy Oommen Rides Cycle Dads Legacy to Reach Voters | Sakshi
Sakshi News home page

Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు!

Mar 26 2026 2:02 PM | Updated on Mar 26 2026 2:08 PM

Chandy Oommen Rides Cycle Dads Legacy to Reach Voters

పుదుపల్లి: కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ అభ్యర్థి ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్భాటాలు లేవు, భారీ కటౌట్లు అసలే లేవు. కేవలం ఒక సైకిల్, ఒంటిపై తండ్రి బొమ్మ ఉన్న టీషర్ట్.. ప్రజల ఆశీస్సులు కోరుతూ పుదుపల్లి నియోజకవర్గంలో చాందీ ఊమెన్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనయుడు, ప్రస్తుత యూడీఎఫ్ అభ్యర్థి చాందీ ఊమెన్ తనదైన శైలిలో ‘గ్రీన్ క్యాంపెయిన్’కు శ్రీకారం చుట్టారు.

హోరెత్తే ప్రచారానికి స్వస్తి
సాధారణంగా ఎన్నికలంటే వీధివీధినా వెలిసే భారీ ఫ్లెక్సీలు, మైకులతో హోరెత్తే ప్రచార రథాలు గుర్తొస్తాయి. కానీ, పుదుపల్లిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పోస్టర్లు గోడల నిండా కనిపిస్తున్నా, చాందీ ఊమెన్ మాత్రం ఎక్కడా ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమాసియాలో యుద్ధం, మానవీయ సంక్షోభం నెలకొన్న వేళ.. ప్రచారం కోసం అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. అది సరైన సమయం కాదు’ అని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రచారం కోసం ఖర్చు చేసే నిధులను నియోజకవర్గంలోని పేదల కోసం 100 ఇళ్లు నిర్మించడానికి ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ప్రచార ఆర్భాటాల కంటే పేదలకు గూడు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రోజూ సైకిల్‌పై..
ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే తన హైబ్రిడ్ సైకిల్‌పై చాందీ ఊమెన్ ప్రయాణం మొదలవుతుంది. తన తండ్రి ఫోటో ఉన్న వైట్ టీషర్ట్ ధరించి, గ్రామీణ ప్రాంతాల్లోని ఇరుకు దారుల్లో సైకిల్ తొక్కుతూ ప్రతి ఇంటిలోని వారినీ ఆయన పలకరిస్తున్నారు. ‘గతంలో పాదయాత్ర చేశాను, కానీ సైకిల్ అయితే గంటకు 31 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలుసుకునే అవకాశం నాకు దక్కుతోంది’ అని ఆయన వివరించారు. దారి పొడవునా స్కూలు పిల్లలతో ముచ్చటిస్తూ, వృద్ధుల యోగక్షేమాలు అడుగుతూ, సెల్ఫీలు ఇస్తూ సాగుతున్న ఆయన యాత్రకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు.

తండ్రి వారసత్వం
పుదుపల్లి అంటే ఊమెన్ చాందీకి పెట్టని కోట. 2023 ఉప ఎన్నికల్లో తన తండ్రి సాధించిన మెజారిటీ (9,000) కంటే ఎక్కువగా, దాదాపు 37,000 ఓట్ల మెజారిటీతో చాందీ ఊమెన్ విజయం సాధించారు. తన తండ్రి తనకు ఇచ్చిన అతిపెద్ద సలహా ‘ఎప్పుడూ ప్రజలతోనే ఉండు, ఎవరినీ నొప్పించకు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. కేరళ ప్రభుత్వం తన నియోజకవర్గంపై వివక్ష చూపుతోందని, తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు.

తండ్రి అడుగుజాడల్లోనే..
చాందీ ఊమెన్ ప్రచార శైలిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన ఏమాత్రం అలసట లేకుండా గంటల తరబడి సైకిల్ తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆయన తండ్రి లాగే నిరాడంబరంగా ఉండటం మాకు సంతోషంగా ఉంది’ అని ఓటర్లు అంటున్నారు. ఆయన వెనుక అనుచరులు, భద్రతా సిబ్బంది వాహనాలు ఉన్నప్పటికీ, చాందీ ఊమెన్ మాత్రం సామాన్యునిలా సైకిల్‌పైనే ప్రజల్లో మమేకమవుతున్నారు. ఎండ తీవ్రత పెరగకముందే ఉదయం 8:30 గంటల వరకు ప్రచారం ముగించి, కొద్దిసేపు టిఫిన్ విరామం తీసుకుని తిరిగి తన తదుపరి షెడ్యూల్‌లో బిజీ అయిపోతున్నారీ యువ నేత.

ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement