కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామ నవమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధిస్తూ మమతా బెనర్జీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఊరేగింపుల్లో ఆయుధాలు చేతపట్టడంపై నిషేధం విధిస్తూ, భద్రతా వలయాన్ని కట్టుదిట్టం చేసింది.
శోభాయాత్రకు పరిమితి
గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రామ నవమి శోభాయాత్రల కోసం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో మోహరించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రతి ఊరేగింపులో పాల్గొనే భక్తుల సంఖ్య 500 కు మించకూడదనే నిబంధన విధించారు. ఒకవేళ ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినా లేదా నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ మంది గుమిగూడినా, ఆ యాత్రను తక్షణమే నిలిపివేసి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
హౌరా, చందన్‌నగర్, ఇస్లాంపూర్ వంటి సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయడమే కాకుండా, అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలను (సీఆర్‌పీఎఫ్)కూడా సిద్ధంగా ఉంచారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తక్షణమే స్పందించేలా వ్యూహాలు రచించారు.
నబన్నాలో ఉన్నత స్థాయి సమీక్ష
భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డీజీపీ, ఏడీజీ (శాంతిభద్రతలు) తో పాటు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, ఎస్పీలు ఈ భేటీలో పాల్గొన్నారు. మార్చి 26 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రామ నవమి ర్యాలీలు జరిగే అవకాశం ఉందని, గురువారం నాడు అత్యధిక సంఖ్యలో ర్యాలీలు వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. బెంగాల్ అంతటా శ్రీరామ నవమి వేళ పోలీసుల పహారా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు


