న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల వేళ భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ నాయకత్వం వహించడం భారత్‌కు ‘అవమానకరం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
భారత్‌కు దక్కిందేమిటి?
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆపై సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్య ప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు దేశాలు శాంతి చర్చలకు చొరవ చూపుతుంటే, భారత్ వెనుకబడిపోవడంపై థరూర్ అసహనం వ్యక్తం చేశారు.
‘ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పేవిధంగా.. భారత్ శాంతి దూతగా నిలుస్తుందని ఆశించి, ప్రభుత్వం వహిస్తున్న మౌనాన్ని సమర్థించాను. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా పాకిస్తాన్‌కు వెళ్తుంటే చూడటం బాధాకరం. ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తనకున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
‘దళారీ దేశం కాదు’: జైశంకర్ కౌంటర్
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విపక్షాల విమర్శలకు అత్యంత ఘాటుగా స్పందించారు. ‘భారత్ ఏమీ దళారీ దేశం కాదు" అంటూ విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. 1981 నుండి అమెరికా పాకిస్తాన్‌ను ఒక సాధనంగా వాడుకుంటూనే ఉందని, ఇందులో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశారు. యుద్ధం వల్ల అన్ని పక్షాలు నష్టపోతున్నాయని, దీనిని త్వరగా ముగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్పష్టం చేశారని కేంద్రం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం!


