పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం! | Petrol Diesel Shortage Boosts Electric Scooter Demand | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం!

Mar 26 2026 11:13 AM | Updated on Mar 26 2026 11:20 AM

Petrol Diesel Shortage Boosts Electric Scooter Demand

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో పలువురు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. అయితే గంటల తరబడి వేచి చూసినా చుక్క పెట్రోల్ దొరకని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు.

పెట్రోల్ కష్టాలు.. ఈవీ వైపు అడుగులు
యుద్ధం ఎఫెక్ట్‌తో చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర రద్దీ కనిపిస్తోంది. అయితే ఈ ఇబ్బందులను భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మళ్లుతున్నారు. తాజాగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ వద్ద వినియోగదారులు తమ గోడును వెళ్లగక్కారు.

వినియోగదారుల ఆవేదన
ఒక కస్టమర్ మాట్లాడుతూ ‘పెట్రోల్ కోసం మూడు నాలుగు గంటల పాటు లైన్లో నిలబడినా ఫలితం ఉండటం లేదు. జేబులో డబ్బులు ఉన్నా.. ఇంధనం దొరకడం లేదు. ఈ టెన్షన్ కంటే ఒక ఎలక్ట్రిక్ బండి కొనుక్కోవడం ఎంతో ఉత్తమం అనిపించింది. అందుకే ఆలోచించకుండా ఈరోజే కొత్త ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నాను’ అని పేర్కొన్నారు.

పెట్రోల్ ధరల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని నిర్ణయించుకున్నానని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు..పెట్రోల్ కోసం దాదాపు 30 నుండి 40 నిమిషాలు లైన్‌లో నిలబడాల్సి వచ్చిందని, భవిష్యత్తులో పెట్రోల్ కొరత ఏర్పడితే రోజువారీ అవసరాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా ఈవీని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇంకొక వినియోగదారుడు మాట్లాడుతూ తన కుమార్తె కోసం గత 6 నెలల నుండి ప్లాన్ చేస్తున్నామని, ఆమెకు సరైన వయసు రావడంతో ఇప్పుడు ఈవీ కొనిచ్చామని చెప్పారు.. నాన్న స్కూటర్ కొనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, తాను, తన తమ్ముడు కలిసి ఈ కలర్‌ను ఎంచుకున్నామని కుమార్తె తెలిపింది.

‘నిన్న రాత్రి పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీని చూసి, భవిష్యత్తులో పెట్రోల్ దొరకదేమో అనే భయంతో ఈ రోజే ఈవీ బండిని డెలివరీ తీసుకున్నట్లు ఒక వినియోగదారుడు చెప్పారు. బండి ముందు భాగంలో సరుకులు పెట్టుకోవడానికి చాలా ఖాళీ స్థలం ఉందని, వ్యాపార అవసరాలకు ఇది చాలా సౌకర్యంగా ఉందని అన్నారు. దీనికి జీరో మెయింటెనెన్స్ అని తెలిపారు. తన దగ్గర పాత యాక్టివా ఉన్నప్పటికీ, పెట్రోల్ కష్టాల వల్ల దీనికి మారానని పేర్కొన్నారు. 

ఈవీ షోరూమ్‌ల వద్ద సందడి
గత రెండు రోజులుగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు. కేవలం పెట్రోల్ భయం మాత్రమే కాకుండా, ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేకపోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం (100-120 కి.మీ) ప్రయాణించే వీలుండటంతో సామాన్యులు వీటిని కొనేందుకు క్యూ కడుతున్నారు. ​పెట్రోల్ కష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రోడ్లపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement