
పుణె : నాగ్‌పూర్‌కు చెందిన రాజ్ ధగ్‌వర్.. పూనే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుతున్నాడు. అమెరికాకు చెందిన అలెస్సాండ్రో చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమం ‘టెల్ యువర్ స్టోరీ’ రాజ్‌ను ఆకర్షించింది. దీంతో ఆ కార్యక్రమాన్ని ఇండియాలో చేపట్టాలనుకున్నాడు. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ ప్లకార్డు తయారుచేసుకున్నాడు. దానిపై ‘ మీ కథ నాకు చెబితే 10రూపాయలు ఇస్తాను’ అని రాశాడు. ప్రతిరోజు ఫర్గుసన్ కాలేజ్ రోడ్‌లో ప్లకార్డు పట్టుకుని నిలబడేవాడు. జనం అతడి దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. తక్కువ సమయంలో రాజ్ సోషల్ మీడియా సెలెబ్రిటీ అయిపోయాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ నేను మొదటిరోజు ఉదయం 8నుంచి రాత్రి 11.30 వరకు ఎఫ్‌సీ రోడ్‌లో నిలుచున్నాను. పెద్దగా స్పందన వస్తుందనుకోలేదు. అయితే చాలా మంది నా దగ్గరకు వచ్చేవారు.
మాట్లాడుకునే వాళ్లం. వాళ్లను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. చిన్న సంభాషణకు 10 రూపాయలు ఇస్తుండటం. నేను విన్న కథల్లో బాగా నచ్చిన కథంటే ఓ వ్యక్తి తన 22 ఏళ్ల వయసులో తాగుడు మానటానికి పోరాడటం. ఆ వ్యక్తి ప్రేమ విఫలమవ్వటంతో తాగుడుకు బానిసయ్యాడు. ప్రతీరోజు తాగేవాడు. అది చూడలేక అతడి తండ్రి మరణించాడు. దీంతో అతడిపై అతడికి అసహ్యం వేసింది. ఎలాగైనా తాగుడు మానుకోవాలనుకున్నాడు. థెరపీకి వెళ్లి తాగుడు అలవాటు మానుకున్నాడు. నేను పది రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని వేరే వారికి ఇవ్వమని చెబుతున్నాను. ఎందుకంటే అలాగైనా మానవత్వం ముందుకు పోతుందని,. మన కథలు వినటానికి ఏవరైనా ఒకరు కచ్చితంగా ఉండాలని నేను నమ్ముతాను. ఓ రోజు నా వీడియోను చూసిన దుబాయ్‌లోని అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు’’ అని అన్నాడు.