న్యూఢిల్లీ: దేశ ప్రజలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. వారిలో 21 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతోంది. ఈ ఘటన అనంతరం గాయపడిన మద్దతుదారులను పరామర్శించిన దీప్కే.. వారిని రక్షించడంలో విఫలమైనందుకు దేశ ప్రజలకు, ముఖ్యంగా తమ పార్టీ మద్దతుదారులకు క్షమాపణలు తెలిపారు.
గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన అభిజీత్ దీప్కే, నిరసనలో గాయపడిన మద్దతుదారులకు, ముఖ్యంగా మహిళా నిరసనకారులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. మా మద్దతుదారులందరికీ.. ముఖ్యంగా పురుష పోలీసుల చేతిలో దాడికి గురైన యువతులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మిమ్మల్ని రక్షించడంలో మేము ఇంకా మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఢిల్లీ పోలీసుల చర్యల నుంచి మిమ్మల్ని కాపాడలేకపోయాం. దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, 20 మందికి పైగా విద్యార్థుల మరణాలకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడేందుకే ప్రభుత్వం మరికొంత మంది యువ విద్యార్థుల రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధపడింది అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన వారు ఎవరైనా ఉంటే తనను వ్యక్తిగతంగా సంప్రదించాలని కూడా ఆయన కోరారు.
సోమవారం జరిగిన నిరసనకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, సీజేపీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పార్లమెంట్ పరిసరాలకు చేరుకున్నారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుండగా, నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి.


