● భక్తిశ్రద్ధలతో దీపావళి వేడుకలు
● పోలీసు సిబ్బందికి స్వీట్లు పంచినఎస్పీ డా.వినీత్
నారాయణపేట: ఓవైపు చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్మిన మట్టి ప్రమిదలు.. మరోవైపు ఆకాశంలో రంగురంగుల కాంతులు విరజిమ్మిన బాణాసంచా.. భక్తిశ్రద్ధలతో ధనలక్ష్మీదేవి పూజలు.. ఆది, సోమవారాల్లో జిల్లావ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని గడపలకు బంతిపూలు, మామిడి తోరణాలు కట్టి.. రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. సాయంత్రం వేళ ఇళ్ల ముందు వరుసగా మట్టి ప్రమిదలను వెలిగించి పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాల అలంకరణలతో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సభ్యులంతా కలిసి టపాసులు కాలుస్తూ, పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
లక్ష్మీ కటాక్షం కోసం ప్రత్యేక పూజలు..
దీపావళి పర్వదినంలో లక్ష్మీపూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో ఇళ్లలో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గౌరీ నోములు నోచుకోవడంతో పాటు సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. తమ కుటుంబంలో సిరిసంపదలు, సౌభాగ్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రార్థించారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు తమ దుకాణాల్లో లక్ష్మీదేవి, సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చేశారు.
● ఎస్పీ డా.వినీత్ తన క్యాంపు కార్యాలయంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన సతీమణి ప్రీతి, కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చుతూ సంబరాల్లో పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ధన్వాడలో బాణాసంచా కాలుస్తున్న గ్రామస్తులు
సంప్రదాయాల సందడి..
జిల్లా కేంద్రంలోని సెంటర్ చౌక్, సరాఫ్ బజార్ ప్రాంతాలు విద్యుద్దీపాల అలంకరణతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. మార్వాడీ కుటుంబాలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీపూజలు నిర్వహించారు. వ్యాపార సముదాయాల్లో పూజా కార్యక్రమాలు, ఇళ్లలో దీపారాధనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి.
బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్త
కోస్గి రూరల్: బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా.వినీత్ సూచించారు. ఆదివారం కోస్గి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చడంతో పాటు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రజల భద్రత కోసం శ్రమించే పోలీసులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐలు సైదులు, శివశంకర్, రాంలాల్, భగవంతరెడ్డి పాల్గొన్నారు.


