కోస్గి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కలను సాకారం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. పట్టణంలో లబ్ధిదారు లావణ్య – నర్సింహ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో ఆదివారం దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. నూతన గృహల్లో అడుగుపెట్టిన లబ్ధిదారుల జీవితాల్లో ఈ దీపావళి కొత్త కాంతులు, సుఖ సంతోషాలు నింపాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, ఆర్డీవో రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కమిషనర్ నాగరాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.


