అబ్బురపరిచే ప్రయోగాలు.. ఆసక్తిగా తిలకించిన సీఎం | - | Sakshi
Sakshi News home page

అబ్బురపరిచే ప్రయోగాలు.. ఆసక్తిగా తిలకించిన సీఎం

Nov 10 2026 1:07 AM | Updated on Nov 10 2026 1:07 AM

● సైన్స్‌ మ్యూజియంలో విద్యార్థుల

వివరణకు ఫిదా

● ప్రయోగాల పనితీరును ఆసక్తిగా తెలుసుకున్న రేవంత్‌రెడ్డి

కోస్గి రూరల్‌: పుస్తకాల్లో చదువుకున్న విజ్ఞానశాస్త్ర సూత్రాలు కళ్లముందే ప్రయోగాల రూపంలో కనిపిస్తే ఆ ఆసక్తే వేరు. అందులోనూ వాటి పనితీరును విద్యార్థులే వివరించడం విశేషం. కోస్గిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన సర్‌ సీవీ రామన్‌ సైన్స్‌ మ్యూజియంలో ఇలాంటి ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. మ్యూజియంలోని వివిధ గ్యాలరీలు, ఇంటరాక్టివ్‌ సైన్స్‌ ప్రదర్శనలను సీఎం ఆసక్తిగా తిలకించారు. వాటి పనితీరు, వెనుక ఉన్న శాసీ్త్రయ సూత్రాలను స్థానిక బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా సైన్స్‌ అధికారితో కలిసి వివరించారు. ఫిజిక్స్‌ అండ్‌ ఫన్‌ సైన్స్‌ గ్యాలరీ, బయాలజీ అండ్‌

లైఫ్‌ సైన్స్‌ గ్యాలరీ, మ్యాథమెటిక్స్‌ గ్యాలరీ, ఖగోళశాస్త్ర గ్యాలరీలను సీఎం సందర్శించారు. ప్రముఖ శాస్త్రవేత్తల విగ్రహాలు, డిజిటల్‌ టచ్‌స్క్రీన్లు, వివిధ విజ్ఞానశాస్త్ర పరికరాలు, నమూనాలను పరిశీలించారు. బటన్‌ నొక్కగానే పనిచేసే ప్రయోగాలు, శాసీ్త్రయ సూత్రాల ఆధారంగా రూపొందించిన ప్రదర్శనలు ఆయనను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఎంతో స్పష్టంగా, ఉత్సాహంగా ప్రయోగాల ప్రత్యేకతలను వివరించడంతో సీఎం ఆసక్తిగా విన్నారు.

తేలియాడే బంతి.. బెర్నౌలీ సూత్రం!

మ్యూజియంలోని తేలియాడే బంతి ప్రయోగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బటన్‌ నొక్కగానే గాలి ప్రవాహం కారణంగా బంతి గాలిలో తేలియాడుతూ కనిపిస్తుంది. గాలి వేగం, పీడనాల మధ్య సంబంధాన్ని వివరించే బెర్నౌలీ సూత్రం ఆధారంగా ఈ ప్రయోగం పనిచేస్తుందని కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం.పల్లవి ముఖ్యమంత్రికి వివరించారు. విమానం రెక్కలపై గాలి ప్రవాహం వల్ల ఏర్పడే ఉత్థాపక బలాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుందని తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో చదివే సూత్రాలను ఇలాంటి ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా అర్థం చేసుకోవచ్చని వివరించింది. విద్యార్థులు ప్రయోగాలను కేవలం ప్రదర్శించడమే కాకుండా వాటి వెనుక ఉన్న శాసీ్త్రయ కారణాలను కూడా వివరించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement