నారాయణపేట: ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోందని.. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ పొందలేని పేద అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించేందుకు తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ముందుకొచ్చిందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీపీఎస్‌సీ గ్రూప్స్‌తో పాటు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన వారు అర్హులని.. ఆసక్తి గల అభ్యర్థులు మైనార్టీ ధ్రువపత్రం, విద్యార్హత ధ్రువపత్రం, పోటీ పరీక్ష దరఖాస్తు లేదా రిజిస్ట్రేషన్ ప్రతితో పాటు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో జతచేసి ఈ నెల 12వ తేదీలోగా జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
సాగునీటి వృథాకు అడ్డుకట్ట వేయాలి
మక్తల్: సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిని వృథా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌రాంరెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయకట్టులో సాగుచేసిన పంటలకు నీరు సరిపోక రైతులు ఇబ్బందులు పడుతుండగా.. కొందరు 15 రోజుల నుంచి అర్ధరాత్రి వేళ ప్రాజెక్టు దిగువన ఉన్న పెద్దవాగుకు షట్టర్ల ద్వారా నీటిని వృథాగా వదులుతున్నారన్నారు. తద్వారా సంగంబండ రిజర్వాయర్‌ను ఖాళీ చేసి, ఇసుక అక్రమ రవాణా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు నీటి వృథాను అరికట్టకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఉపాధ్యక్షుడు కర్నిస్వామి, కార్యదర్శి కనకరాజు, ఓబీసీ జిల్లా నాయకుడు సత్యనారాయణ, జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి జావిద్ ఉన్నారు.
నిర్వాసిత సంఘం
నాయకుల అరెస్టుపై ఖండన
నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తున్న నిర్వాసిత సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు జి.వెంకట్రాంరెడ్డి, ఎం.గోపాల్‌రెడ్డి, ధర్మరాజుగౌడ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హకీంపేటలో జరిగిన సీఎం సభకు హాజరై నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విషయమై ముందుగానే స్థానిక మంత్రి అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు సమాచారం ఇస్తానని చెప్పారని.. ఆ తర్వాత సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. చివరి వరకు అవకాశం లభిస్తుందనే ఆశతో సభకు బయలుదేరిన తమను పోలీసులు అడ్డుకొని నేరుగా కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. నిర్వాసితుల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను ఇలా అదుపులోకి తీసుకోవడం సరైంది కాదన్నారు.


