జాప్యమెందుకో..? | - | Sakshi
Sakshi News home page

జాప్యమెందుకో..?

Oct 17 2026 8:30 AM | Updated on Oct 17 2026 8:30 AM

ర్యాలంపాడు రిజర్వాయర్‌

గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌ మరమ్మతుకు నోచుకోవడం లేదు. నాలుగేళ్ల కిందట ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ కాస్త 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీంతో ర్యాలంపాడు జలాశయం కింద 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతుండగా.. యాసంగి సీజన్‌లో క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నారు.

రూ.4.92 కోట్లు మంజూరు

ర్యాలంపాడు రిజర్వాయర్‌ మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. అయితే పలుమార్లు హైదరాబాద్‌, పుణెల నుంచి ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రిజర్వాయర్‌ను సందర్శించి సర్వే చేశారు. మరమ్మతు చేసేందుకు ముందస్తుగా 7 రకాల శాంపిల్స్‌ సేకరించి నివేదిక కోసం హైదరాబాద్‌లోని టీఎస్‌ఈఆర్‌ఎల్‌ (తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌ రీసెర్చి ల్యాబ్‌)కు పంపారు. వీరు ఇచ్చే నివేదికను పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీ ల్యాబ్‌కు పంపించి అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. దీనిపై గత రెండు నెలలుగా ఎలాంటి నివేదిక రాలేదు. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ స్థాయిని పెంచేందుకు ఆమోదం తెలిపింది. దీని కారణంగానే ర్యాలంపాడుకు మరమ్మతు చేపట్టేందుకు ప్రభుత్వం పునరాలోచనలో పడిందా అన్న ప్రచారం జరుగుతోంది.

ఏజెన్సీలతో సర్వే..

ర్యాలంపాడు రిజర్వాయర్‌కు లీకేజీ ఏర్పడిన అనంతరం మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదట రూ.60 లక్షలతో హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులు అప్పగించింది. ఆరు నెలలపాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్‌ బృందంతో సర్వే చేయించింది. పుణె ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించి.. ఆనకట్టలోని రాక్‌ టోల్‌ లేయర్లు, తూముల అడుగు భాగంలో ఏడు రకాల మట్టి శాంపిల్స్‌ సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ రీసెర్చి ల్యాబ్‌కు పంపారు. ఇక్కడి నుంచి వచ్చిన రిపోర్టును తుది నివేదిక కోసం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక ఆధారంగానే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉంది.

ర్యాలంపాడ్‌ జలాశయ మరమ్మతుల్లో తీవ్ర అలసత్వం

ఆనకట్ట, తూముల రిపేర్‌ కోసం రూ.4.92 కోట్లు మంజూరు

టీఎస్‌ఈఆర్‌ఎల్‌ నివేదిక ఆలస్యమే కారణమా?

సాగునీటి ఇబ్బందులతో యాసంగిలో క్రాప్‌ హాలీడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement