వీడని మరమ్మత్తు | - | Sakshi
Sakshi News home page

వీడని మరమ్మత్తు

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

ఎంజీకేఎల్‌ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్‌ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారు లు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఇదీ పరిస్థితి..

కేఎల్‌ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్‌హౌజ్‌ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న చెరువులను నింపుతున్నారు. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో నీటి ఎత్తిపోతల కోసం 5 మోటార్లను ఏర్పాటుచేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. ఐదేళ్ల క్రితం పంప్‌హౌజ్‌లోకి నీరు చేరుకోవడంతో ఒక మోటార్‌, రెండున్నర ఏళ్ల క్రితం మరో మోటార్‌ దెబ్బతింది. వీటికి మరమ్మతు చేపట్టడంలో ఆలస్యం అవుతుండటంతో మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.

వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు

ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు

దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టుపై తీవ్రభారం

తాజాగా వరదలు వచ్చే సీజన్‌

కావడంతో ఈసారి అదే పరిస్థితి

పూర్తిగా నిలిపివేస్తేనే..

ప్రాజెక్టులో మోటార్ల మరమ్మతుకు పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్‌ భగీరథ స్కీం కేఎల్‌ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లకు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే.. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపివేసేందుకు వీలు ఏర్పడుతుంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement