నారాయణపేట ఎడ్యుకేషన్: ఆధునిక బోధన పద్ధతులను తరగతి గదితో వినియోగించినప్పుడే శిక్షణకు సార్థకత లభిస్తుందని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. బుధవారం నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో మూడురోజుల పాటు కొనసాగిన ఇంటిగ్రేటెడ్ ఇన్‌సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న యాక్టివిటీ బేస్‌డ్ లర్నింగ్, ఎఫ్‌ఎల్‌ఎన్ కిట్ల వినియోగాన్ని ప్రతి తరగతి గదిలో తప్పనిసరిగా అమలుచేయాలన్నారు. అదేవిధంగా సాంప్రదాయ బ్లాక్‌బోర్డు బోధనకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల భాగస్వామ్యంతో బోధించినప్పుడే మెరుగైనా అభ్యసన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం నేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, అదేవిధంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడియల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధన విధానాలను పాఠశాలలో సమర్థవంతంగా అమలుచేయడంతో విద్యార్థుల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత, ఆసక్తి పెంపొందుతాయని చెప్పారు. నిబద్దత, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులే సమాజ నిర్మాణాకి మూలం అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు దీక్షయాప్‌లో QLT-TCT కోర్సును పూర్తిచేసి సర్టిఫికేట్ పొందాలని సూచించారు. శిక్షణలో 77 మంది జీవశాస్త్ర, 38 మంది సాంఘిక, 65 మంది తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్, వివిధ సబ్జెక్ట్‌ల డీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.


