పాలమూరు: పాలమూరు మెడికల్ కళాశాలకు మరో 25 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఎన్‌ఎంసీ మంగళవారం అనుమతులు ఇచ్చింది. 2016– 17 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభమైంది. ఆ తర్వాత ఎదిర శివారులో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో మెడికల్ కళాశాల శాశ్వత భవనం నిర్మించారు. 2019లో 150 సీట్ల నుంచి 175 సీట్లకు పెంచగా ప్రస్తుతం కళాశాలలో 825 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. తాజాగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2026– 27 నుంచే పెరిగిన సీట్లు ఏర్పాటుకు అనుమతి కల్పించారు. దీంతో పాలమూరు మెడికల్ కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి.
● 2016 నుంచి 2026 వరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆరు బ్యాచ్‌లు బయటకు వెళ్లాయి. అదేవిధంగా 34 పీజీ సీట్లు మంజూరు కాగా 34 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే బీఎస్సీ సైన్స్‌లో 70 సీట్లు, డీఎంఎల్‌టీలో 30 సీట్లు, డయాలసిస్‌లో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మొట్టమొదటి కళాశాల..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదట ఏర్పాటైన పాలమూరు మెడికల్ కళాశాలలో ఒక్కో విభాగం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మొదట జనరల్ ఆస్పత్రిలో వెనుక భాగంలో ఉన్న భవనంలో తాత్కాలికంగా కళాశాల నిర్వహణ సాగింది. గత 11 ఏళ్ల కాలంలో మెడికల్ కళాశాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా ఉస్మానియా, గాంధీ తర్వాత పాలమూరు కళాశాల మూడో స్థానంలో ఉండటం విశేషం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటుతో మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. పాత కలెక్టరేట్ స్థానంలో గత ప్రభుత్వం వెయ్యి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2022 డిసెంబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణాలతోపాటు వసతుల కల్పన కోసం మొత్తం రూ.270 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు నాలుగు బ్లాక్‌లు పూర్తి కాగా.. ఈ–బ్లాక్ పనులు కొనసాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరో 25 సీట్లకు అనుమతి ఇచ్చిన ఎన్‌ఎంసీ
మొత్తం 200లకు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
అదనంగా వచ్చిన వాటితో పేద విద్యార్థులకు మేలు


