నారాయణపేట: ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ప్రతీక ప్రజావాణి.. అధికారులు బాధ్యతగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ప్రియాంకతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్‌ఓ రాజేశ్వరి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించాలని, పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 31 వినతులు రాగా.. అందులో చేనేతకు సంబంధించి 1, బ్యాంకు సమస్యలపై ఒకటి, భారత్‌మాల రోడ్డు సమస్యలపై 3, డీపీఓకు 2, డీఈఓకు 1, భూ సమస్యలపై 20, సర్వే కోసం ఒకటి, ఇరిగేషన్ సమస్యలపై రెండు ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వరి నాట్లు వేయడానికి యూరియా, డీఏపీ కొనడానికి దుకాణానికి వెళ్లాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వాలని అడిగితే స్టాక్ లేదన్నారు. కొద్దిసేపటి తర్వాత రూ.300 ఇస్తే యూరియా ఉందన్నారు. అంతేగాక ఫలానా పురుగుమందు, విత్తనాలు కొంటేనే ఎరువులు ఇస్తామని చెప్పారు. అవసరం లేకపోయినా కొనాల్సిన పరిస్థితి వచ్చింది. డీఏపీ బస్తాపై ప్రభుత్వ ధర రూ.1,350 ఉండగా రూ.1800 కంటే ఎక్కువ అడిగారు. రైతుల ఇబ్బందులను అవకాశంగా మార్చుకొని కొందరు వ్యాపారులు లాభాలు చూస్తున్నారు. – వెంకట్రాములు,
జిల్లా అధ్యక్షుడు, భారతీయ కిసాన్‌మోర్చా
జీవితమంతా కష్టపడి ఐదు ఎకరాలకుపైగా భూమి సంపాదించాం. వృద్ధాప్యంలో పిల్లలే ఆధారం అనుకొని నలుగురు కుమారుల పేర్లపై పట్టా చేశాం. ఏటా ఖర్చులకు డబ్బులిస్తామని, చూసుకుంటామని మాట ఇచ్చారు. భూమి వారి పేరున మారాక ఎవరూ పట్టించుకోవడం లేదు. తిండి కూడా సరిగా పెట్టడం లేదు. అనారోగ్యం పాలైనా.. అడిగేవారు లేరు. పట్టా చేసిన భూమిని తిరిగి మా పేరుపై మార్చాలని కలెక్టర్‌కు విన్నవించాం.
– కుర్వ వెంకటయ్య దంపతులు,
పాతర్చేడ్, నర్వ మండలం
15 నెలలుగా వేతనాలు లేవు.. కుటుంబాన్ని పోషించలేక విధులకు వెళ్లలేకపోతున్నాం. 2025, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల జీతం కూడా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు, అప్పులు అన్నీ పెరిగాయి. చివరకు ఉద్యోగానికి వెళ్లడానికి అయ్యే బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. అందుకే జూన్ 1 నుంచి విధులకు హాజరుకాలేకపోతున్నాం. పలుమార్లు అధికారులకు సమస్య చెప్పినా పరిష్కారం కాలేదు. – 104 సిబ్బంది
గతంలో మేము కలెక్టర్ దగ్గర సింగారం గ్రామపంచాయతీ పరిధి కౌరంపల్లి శివారులో ప్లాట్లు కొనుగోలు చేశాం. హద్దు రాళ్లను తొలగించడంతో ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. హైకోర్టులో కేసు నడుస్తుండగా స్టే ఆర్డర్ కూడా వచ్చింది. అయినప్పటికీ కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జిల్లా సర్వేయర్‌తో కొలిపించి సరిహద్దు రాళ్లు పాతించి ప్లాట్లను గుర్తించి అప్పగించాలి. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం కాలేదు.


