అపార్‌.. అంతంతే..! | - | Sakshi
Sakshi News home page

అపార్‌.. అంతంతే..!

Jul 7 2026 1:37 AM | Updated on Jul 7 2026 1:37 AM

జిల్లాలో మందకొడిగా సాగుతున్న నమోదు

నారాయణపేట రూరల్‌: జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ తరహాలో ప్రతి విద్యార్థికి అపార్‌ (అటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వన్‌ నేషన్‌ వన్‌ స్టూడెంట్‌ లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, గురుకుల, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి 11 అంకెలతో కూడిన సంఖ్యను కేటాయిస్తున్నారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో 2023, అక్టోబర్‌ 18న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. ఆధార్‌లోని సమాచారం, విద్యార్థుల అడ్మిషన్‌ రిజిస్టర్‌లోని వివరాలతో సరిపోలక సాంకేతిక చిక్కులు తలెత్తడంతో గతేడాది చివరి వరకు సైతం పూర్తి కాలేదు. వివిధ సమస్యలతో నిర్ణీత సమయంలో నమోదు ప్రక్రియ పూర్తికావడం లేదన్న వాదన వినిపిస్తుంది.

టాప్‌లో మరికల్‌.. చివరిలో గుండుమాల్‌...

మరికల్‌ మండలంలో 81 శాతం అపార్‌ పూర్తిచేసి మొదటి స్థానంలో నిలువగా.. 67 శాతంతో గుండుమాల్‌ చివరి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు రోజువారీగా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్నా.. సాంకేతిక కారణాల దృష్ట్యా అపార్‌ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కావడంతో నూతనంగా చేరే విద్యార్థులకు సైతం అపార్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

● ‘నారాయణపేట మండలం కోటకొండకు చెందిన విద్యార్థి పుట్టిన తేది యూడైస్‌లో ఒక విధంగా, ఆధార్‌లో మరో విధంగా ఉండటంతో అపార్‌ పునరుద్ధరణ పూర్తి కాలేదు.

● కొల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థిని ఇంటి పేరు యూడైస్‌లో ఉండగా.. ఆధార్‌లో లేకపోవడంతో వివరాలు సరిపోలక అపార్‌ జనరేట్‌ కావడం లేదు. జిల్లాలో చాలామంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది.’

ఇవీ సమస్యలు..

ముఖ్యంగా ఆధార్‌లోని విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీలో అడ్మిషన్‌ రిజిస్టర్‌లో ఉన్న వివరాలతో సరిపోలక అపార్‌ జనరేట్‌ కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో ఆధార్‌ను సరిచూసుకొని వారి అడ్మిషన్‌ రికార్డుల్లో వివరాలు సరిచేసి అపార్‌ నమోదు చేస్తున్నట్లు తెలిసింది. పదోతరగతి పూర్తయి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు ఈ వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా విద్యార్థులు తప్పకుండా ఆధార్‌కార్డులోని వివరాలను సరి చేసుకోవాల్సి ఉండటం.. స్థానికంగా ఆధార్‌ కేంద్రాలు అందుబాటులో ఉంచకపోవడంతో హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

చైల్డ్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌లో విద్యార్థుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు ఉంటాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అపార్‌ కార్డులను మంజూరు చేయనున్నారు. ఇందులోని గుర్తింపు సంఖ్య ఆధార్‌కార్డు తరహాలో శాశ్వతంగా అందుబాటులోకి ఉంటుంది. విద్యార్హతలు, గ్రేడ్లు, మార్కులు, సాధించిన ప్రగతి, ఉపకార వేతనాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తారు. ఉన్నత విద్య ప్రవేశాలు, పోటీ పరీక్షలకు ఈ డిజిటల్‌ పత్రాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. భవిష్యత్‌లో ఒరిజినల్‌ పత్రాలు లేవనే దిగులు లేకుండా ఈ ప్రక్రియ దోహదపడనుంది. ఇంత ప్రాధాన్యత ఉన్న అపార్‌కు తల్లిదండ్రుల అంగీకారాన్ని తప్పనిసరి చేశారు. విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడం, ఆధార్‌కార్డులో పుట్టిన తేదీలు తప్పుగా నమోదుకావడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్లలో 75 శాతం మాత్రమే పూర్తి

ఆధార్‌ వివరాలు సరిపోలక తీవ్ర జాప్యం

విద్యాసంస్థల్లో తప్పని అవాంతరాలు

కొత్త విద్యా సంవత్సరంలోనూ నామమాత్రంగా ప్రక్రియ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement