సమష్టి కృషితోనే విజయాలు సాధ్యం | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే విజయాలు సాధ్యం

Jul 7 2026 1:37 AM | Updated on Jul 7 2026 1:37 AM

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

నారాయణపేట రూరల్‌: పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కార్యకర్తలు శ్రమించిన తీరును ఆదర్శంగా తీసుకొని పార్టీ శ్రేణులు సమష్టి కృషితో రాబోవు ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగురవేయాలని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని, ప్రజల కష్టాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు అవకాశం లేదని.. కాంగ్రెస్‌ విశ్వాసం కోల్పోయిందని, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు కాకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్‌రెడ్డి పాలనను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిబద్ధతతో పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వెన్ను తడతాయని.. సర్‌ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు బూత్‌స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ సహకరించి నిజమైన ఓటర్లను నమోదు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్‌, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, లక్ష్మి, కొండయ్య, శ్రీనివాసులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సీసీ రోడ్లు, ఐమాస్ట్‌ లైట్లు ప్రారంభం..

మండలంలోని బోయిన్‌పల్లి, అప్పక్‌పల్లి, కొల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఐమాస్ట్‌ లైట్లు, సీసీ రోడ్లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి డబ్బులు వెచ్చించడం లేదని, కేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. రైతులకు రాయితీపై ఎరువులు, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని.. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో మోదీ ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

సర్పంచ్‌ను అభినందించిన ఎంపీ..

మండలంలోని బోయిన్‌పల్లి సర్పంచ్‌ వెంకటేష్‌ తన గౌరవ వేతనాన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయించారు. ఆ డబ్బులతో కంప్యూటర్‌ కొనుగోలు చేసి డీకే అరుణ చేతులమీదుగా పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిస్వార్ధంగా సేవ చేయడం అభినందనీయమని.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వడం ఆనందంగా ఉందన్నారు. మండల అధ్యక్షురాలు జ్యోతి, మాజీ అధ్యక్షుడు సాయిబన్న, మానియమ్మ, భజరంగ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement