కృష్ణమ్మా.. కరుణించుమా! | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మా.. కరుణించుమా!

Jul 6 2026 1:16 AM | Updated on Jul 6 2026 1:16 AM

నదితీర ప్రాంతాల్లో ప్రశ్నార్థకంగా వానాకాలం వరి సాగు

నారున్నా.. నాటు వేయలేని స్థితి..

వరినారు పోసి నెల గడిచింది. ఈపాటికే నాటు వేయాల్సి ఉన్నా.. నదిలో నీరు పారక వేయలేకపోతున్నా. 15 రోజులు దాటాక నాటు వేస్తే దిగుబడి తగ్గుతుంది. సరైన సమయంలో నాట్లు వేస్తేనే అధిక దిగుబడి పొందవచ్చు.

– కుంబరి చంద్రప్ప, రైతు. మురహర్‌దొడ్డి

ఆశలు వదులుకున్నాం..

ఈ ఏడాది వరి పంటపై ఆశలు వదులుకున్నాం. ఇదివరకే నాట్లు వేసుకోవాలి.. కానీ నీరందక వేయలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న నారుమడులు కూడా నీరందక ఎండిపోతున్నాయి. మరోమారు నారుపోసి నాట్లు వేసే అవకాశం ఉండదు. – దేవేంద్రప్ప, రైతు, కుసుమర్తి

కృష్ణా: ఓ పక్క కృష్ణానది.. మరోపక్క పెద్ద వాగు ఉండటంతో ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా మండలం కోనసీమను తలపించేది. 15 ఏళ్లుగా కృష్ణా, భీమా నదుల నుంచి పుష్కలంగా సాగునీరు లభించి పంటల సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ప్రస్తుతం వర్షాకాలం సగం గడిచినా ఆయా నదుల్లో నీరు పారక ఎక్కడ కూడా వరి సాగు చేపట్టకపోవడంతో పోలాలన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా నదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు నీరు లేక మూతబడుతున్నాయి. నదిలో ఉన్న నీటిని కాల్వలు తవ్వి ముందస్తుగా నారుమడులు వేసుకున్నారు. నెలలోపు నాట్లు వేయాల్సి ఉండగా.. 45 రోజులు అవుతున్నా నదిలో నీటిజాడ కనిపించపోవడంతో నారుమడులు ఎండుముఖం పడుతున్నాయి. మరోపక్క పెద్ద వాగుపై సంగంబండ ప్రాజెక్టు నిర్మించడంతో వర్షపు నీరు పారడం లేదు. గతంలో కర్ణాటకలో ఎక్కడో వర్షం కురిసినా కూడ వాగుకు పారి పొలాలకు సాగునీరు అందేది. ప్రస్తుతం ప్రాజెక్టులోనే నీరు లేకపోవడంతో దిగువకు చుక్క నీరు రావడం లేదు. వాగు తీరంలోని గ్రామాల్లో ఉన్న బోరుబావుల్లో నీరు రావడం లేదని, కనీసం నారుమడులకు కూడా అందని పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో కేవలం ఎండకాలంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండేవని.. ప్రస్తుతం వర్షకాలంలోనూ పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సాగు సమయం దాటిపోతోందని.. సకాలంలో వరి నాట్లు వేయకపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వారంలో నదిలో నీరు పారకపోతే పంటల సాగు ప్రశ్నార్థకం కానుందని అంటున్నారు.

నీరు లేక వెలవెలబోతున్న కృష్ణానది

మూతబడిన ఎత్తిపోతలు

ఎండుతున్న నారుమడులు

రెండునెలలుగా ఎదురుచూపులు

ముగుస్తున్న సమయం.. ఆందోళనలో అన్నదాతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement