బాల్యానికి భరోసా.. | - | Sakshi
Sakshi News home page

బాల్యానికి భరోసా..

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

జిల్లాలో ప్రారంభమైన 12వ విడత ఆపరేషన్‌ ముస్కాన్‌

బాలకార్మిక వ్యవస్థ రూపుమాపేందుకే..

నెలరోజుల పాటు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు

మూడురోజుల్లో 9 మంది చిన్నారుల చేరదీత

నర్వ: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం అన్నిశాఖల సమన్వయంతో ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్‌, జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తోంది. బాల్యానికి భరోసా కల్పించేందుకు ఏడాదిలో రెండునెలల పాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి బాలకార్మికుల విముక్తికి కృషి చేస్తోంది. ఈ కొత్త ఏడాది జనవరిలో జిల్లాలో ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం నిర్వహించి 71 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడంతో పాటు 31 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌ను ప్రారంభించి ఇప్పటికే 9 మంది బాలబాలికలకు విముక్తి కల్పించారు. గతేడాది కంటే ఎక్కువ మంది చిన్నారులకు విముక్తి కలిగించేందుకు దాడులను ముమ్మరం చేసేందుకు పోలీసు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

పలుశాఖల సమన్వయంతో..

పోలీసు, కార్మిక, విద్య, సీ్త్ర, శిశుసంక్షేమశాఖ, చైల్డ్‌లైన్‌, సఖి, బాలరక్షక భవన్‌ సమన్వయంతో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్క ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి దాడులు నిర్వహిస్తారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు పనులు చేస్తున్న ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నారు. వారిని చేరదీసి ఆర్బీసీ సెంటర్లు, పాఠశాలల్లో వారు వదిలేసిన తరగతుల్లో చేర్పిస్తున్నారు. వీరితో పాటు తప్పిపోయిన పిల్లలు, అనాథలను గుర్తించి ఆయా కేంద్రాల్లో చేర్పిస్తారు. పిల్లలతో బలవంతంగా పనులు చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

‘బడికి వెళ్లాల్సిన వయస్సు, ఆటలాడుకోవాల్సిన ప్రాయం వారిది.. కాని తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తున్నారు. పాఠశాలల్లో పాఠాలు వినాల్సిన వీరు ఇటుక బట్టీలు, పొలాల్లో కూలీ పనులు, గొర్రెలకాపరులుగా, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులు, వ్యాపారస్తులు పిల్లలతో పనులు చేయిస్తున్నారు. చదువుకునే వయసులో పనులు చేస్తూ బాలకార్మికులుగా మారుతున్నారు.’

బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం..

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా దాడులు నిర్వహిస్తాం. బాలలను చేరదీసి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల బాలబాలికలు ఉంటే వారిని సొంత రాష్ట్రాలకు పంపిస్తాం. బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. బాలకార్మికుల సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – డా. వినీత్‌, ఎస్పీ

కేసులు నమోదు చేస్తాం..

ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా బాలకార్మికుల విముక్తి కోసం మూడు రోజులుగా దాడులు ముమ్మరం చేస్తున్నాం. అనాథ బాలలు, బిక్షాటన చేస్తున్న, తప్పిపోయిన పిల్లలను చేరదీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంతోపాటు వివిధ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఇతర పనులు చేస్తున్న 14 ఏళ్లలోపు బాలలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తాం.

– బాసిత్‌, కార్మికశాఖ జిల్లా అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement